Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసరా కోల్పోయిన పేద కుటుంబం
- సిరిసిల్ల పట్టణంలో విషాదం
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
ఎదిగిన కొడుకు.. కుటుంబాన్ని పోషిస్తూ ఆసరాగా నిలుస్త్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అయ్యాయి. కరెంటు షాక్తో యువ నేత కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గురువారం చోటుచేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనారాయణ తనకున్న నాలుగు మరమగ్గాలతోనే వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఈ తరుణంలో తనకు వృద్ధాప్యం మీద పడటంతో కుమారుడు బూర రాము(22) అందరికీ వృత్తిలో చేదోడువాదోడుగా ఉండేవాడు. కొన్నిరోజులుగా తండ్రి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ భారాన్ని భుజాన వేసుకొని మరమగ్గాల నడిపించుకుంటూ పోషిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే గురువారం ఉదయం మగ్గాలలో ఉపయోగించే ఉండేలు చుట్టేందుకు కండెల చుట్టే మిషన్ ఆన్ చేయగా కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. దాంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడు రాముకు తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి హేమ, వికలాంగుడైన తమ్ముడు లక్ష్మణ్, చెల్లెలు సౌమ్య ఉన్నారు. ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.