Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్పీ గ్యారంటీ చట్టం చయాలని ఏఐకేఎస్‌సీసీ డిమాండ్
- ఈనెల 25,26న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
- పాల్గొననున్న రాకేష్ తికాయత్
నవతెలంగాణ-సిటీబ్యూరో
''ఆహార ధాన్యాల సేకరణ కేంద్రం పనే.. దేశంలో 20 కోట్ల మంది ఆహారభద్రతా సమస్యతో బాధపడుతుంటే.. నిల్వలున్నాయి.. నిల్వలున్నాయి.. ఇకపై ధాన్యం కొనబోమనడం దుర్మార్గం'' అని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ(ఏఐకేఎస్‌సీసీ) రాష్ట్ర కన్వీనర్ టి.సాగర్ అన్నారు. మోడీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని రాజ్ బహదూర్‌గౌర్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.సాగర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఈనెల 25న ఉదయం 10గంటల నుంచి 26న 12 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, గిరిజన, సామాజిక, ఇతర మైనార్టీ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపి.. మహాధర్నాలో భాగస్వాములవుతామని ప్రకటించాయ న్నారు. సంయుక్త కిసాన్ మోర్చా సమన్వయ కమిటీ జాతీయ నాయకులు రాకేష్ తికాయత్, ఏఐకేఎస్‌సీసీ, అఖిల భారత వర్కింగ్ గ్రూపు నాయకులు, రాష్ట్ర కన్వీనర్లు, వివిధ రైతు, కూలీ సంఘాల నాయకులు, కార్మిక తదితర ప్రజా సంఘాల నాయకులు, ప్రజాస్వామిక మేధావులు మహాధర్నాలో ప్రసంగిస్తారని తెలిపారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ రైతులతో చెలగాటమాడుతున్నాయని, ధాన్యం కొనుగోళ్లను పక్కకు పెట్టేసి.. తమ రాజకీయాలు, ఓట్లు మొబైలేజేషన్ ఎట్టా అనే దానిపై కేంద్రీకరించాయని విమర్శించారు. ఆహార ధాన్యాల సేకరణ అనేది కేంద్ర ప్రభుత్వమే చేస్తుందన్నారు. తెలంగాణ, ఉమ్మడి ఏపీలోనూ ఎఫ్‌సీఐ ద్వారానే సేకరణ జరిగేదని గుర్తుచేశారు. కార్పొరేట్లకు రూ.160 కోట్లు మినహాయింపు ఇచ్చిందన కేంద్రం.. దాంట్లో సగం రూ.80వేల కోట్లు ఇస్తే దేశంలో ఆకలితో బాధపడుతున్న వారందరికీ ఆహారం అందించడం, రైతులు పండించిన పంటలు అన్నింటినీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటాకాలు ఆడుతూ రైతాంగానికి అన్యాయం చేయాలని చూస్తే.. రైతాంగం, ప్రజానీకం, ప్రజాసంఘాలతో కలిసి తిరగబడతామని హెచ్చరించారు.
ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్ పశ్య పద్మ మాట్లాడుతూ.. కేసీఆర్ ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాల రద్దు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతానని ప్రకటనలు చేయడం మంచిదే అయినా.. ఆచరణలో ముందుకెళ్లాలని కోరారు.
ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు గ్యారంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు.
ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య మాట్లాడుతూ.. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఏఐకేఎస్‌సీసీ నాయకులు కెచ్చెర రంగయ్య, బి.ప్రసాద్, కాంతయ్య, శోభన్, ధర్మపాల్, ధర్మా నాయక్, అంజయ్య నాయక్, గోపాల్ యాదవ్ పాల్గొన్నారు.