Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎమ్పీని వెనక్కి తీసుకోవాలి
- మోడీ సర్కారు నిర్ణయాలను ప్రతిఘటించాలి : సీఐటీయూ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నయా ఉదారవాద విధానాల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు వేగంగా ప్రయివేటీకరిస్తున్నదనీ, ఇది దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని సీఐటీయూ జనరల్ కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపేయాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశాల్లో గురువారం ఈ తీర్మానం ఆమోదించబడింది. డిఫెన్స్ రంగంలో 41 డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్లను ఏడు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం దారుణమని పేర్కొంది. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పథకం(ఎన్ఎమ్పీ)పేరుతో ప్రజా ధనంతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను, రైళ్లను, రైల్వే షెడ్లు, పోర్టులు, విద్యుత్ పంపిణీ లైన్లు, గ్యాస్ పైపులైన్లు, టెలికాం టవర్లు, జాతీయ రహదారులు, మొదలగు కీలకమైన రంగాలను కార్పొరేట్లకు కట్టబెట్టడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఆర్థిక రంగంలో కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎల్ఐసీ వంటి సంస్థలను ప్రయివేటీకరణకు పూనుకోవడం అన్యాయమని పేర్కొంది. మోడీ సర్కారు అవలంబిస్తున్న విధానాలను కార్మికులు, ప్రజలు ప్రతిఘటించాలనీ, దేశీయ, విదేశీ కార్పొరేట్లు దేశ సంపద, ఆస్తులను దోచుకోకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సీఐటీయూ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.