Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీకి చరమగీతం పాడాల్సిందే..
సరిహద్దు వివాదాలు.. సర్జికల్ స్ట్రైక్లతో పబ్బం గడుతుపుతున్న పార్టీ అది. మతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోంది. ధాన్యం కోసమే కాదు.. దేశం కోసమూ పోరాడతాం. దానికి తెలంగాణ నాయకత్వం వహిస్తుంది. వరి వేయమంటరా..? లేదా...?. యాసంగిలో పండించాలా..? వద్దా..?. ప్రధాని మోడీ సమాధానం చెప్పాలె. కేసులు ఎన్ని పెడతారో పెట్టండి.. చూస్తాం..
- టీఆర్ఎస్ మహాధర్నాలో సీఎం కేసీఆర్ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వడ్ల మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి చరమగీతం పాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. సరిహద్దు వివాదాలు.. సర్జికల్ స్ట్రైక్ల పేరుతో ఇప్పటిదాకా అది రాజకీయాలు చేసిందని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టటం ద్వారా సెంటిమెంటు మీద ఆ పార్టీ గెలుస్తూ వస్తున్నదని విమర్శించారు. కేవలం ధాన్యం కోసమే కాకుండా దేశం కూడా పోరాడాలని కోరారు. ఇందుకోసం అవసరమైతే తెలంగాణ నాయకత్వం వహించాల్సి ఉంటుందని చెప్పారు. గత రబీలో మిగిలిపోయిన బియ్యాన్ని కొంటరా..? కొనరా..? ప్రస్తుత వర్షాకాలం ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తారా..? చేయరా..? భవిష్యత్తులో వరి వేయాలా..? వద్దా..? తదితరాంశాలపై స్పష్టత నివ్వాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. 'మోడీ గారూ... దండం పెట్టి అడుగుతున్నా... ఈ విషయాలపై స్పష్టతనివ్వండి...' అని మొరపెట్టుకున్నారు. రైతుల గురించి మాట్లాడితే... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, కేసీఆర్పై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. 'కేసులకు కేసీఆర్ భయపడతడా..? ఇట్ల భయపడితే తెలంగాణ వచ్చేదా..? ఎన్ని కేసులు పెడతరో పెట్టండి..చూస్తం..' అంటూ సవాల్ విసిరారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్కు (ధర్నాచౌక్) వద్ద మహాధర్నాను నిర్వహించారు. ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మెన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి తరలొచ్చిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఇందిరాపార్కు పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... కేంద్రంపైన, బీజేపీపైన, ఆ పార్టీ రాష్ట్ర నాయకులపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వంకర టింకర మాటలు కాదు.. తెలంగాణలో పండిన వడ్లను కొంటరా..? కొనరా..? అని బండి సంజరునుద్దేశించి ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ గోస మన రాష్ట్రానికే పరిమితమైంది కాదనీ... దేశం మొత్తానిదని అన్నారు. ఏడాది నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. సాగు చట్టాలకు సంబంధించి కేంద్రం తన విధానాలను మార్చుకోవాలంటూ వారు కోరితే కార్లతో తొక్కి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు కొనేందుకు కేంద్రానికి భయమెందుకని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేల ప్రకారం ఆకలి సూచికలో భారత్ 101 స్థానంలో నిలిచిందనీ, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్లో పరిస్థితి మనకంటే మెరుగ్గా ఉందని చెప్పారు. ఇది అత్యంత సిగ్గుచేటని అన్నారు. దేశంలో సగానికిపైగా జనం ఆధారపడిన వ్యవసాయాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని ప్రశ్నించారు. భారత ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించటం, ఎగుమతులను ప్రోత్సహించటం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించొచ్చని అన్నారు. అవసరమైతే రూ.2 లక్షల కోట్లు వెచ్చించైనా సరే, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ ఇందుకు భిన్నంగా మొత్తం వ్యవసాయాన్నే ప్రయివేటీకరిస్తాం, మార్కెట్ కమిటీలను రద్దు చేస్తామని ప్రకటించటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను అర్థం చేసుకోలేని బీజేపీపై యుద్ధాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు.
అడ్డగోలుగా అబద్ధాలు...
సామాజిక మాధ్యమాల ద్వారా బీజేపీ అడ్డగోలుగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని కేసీఆర్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వాట్సాప్, ఫేసుబుక్కుల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వితండ వాదనలు చేస్తున్నారు.. వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్నారు.. ఇప్పటిదాకా ఓపిక పట్టాం.. దానిక్కూడా ఒక హద్దుంటుంది...' అని వ్యాఖ్యానించారు. 'ధాన్యం కొనుగోళ్ల గురించి ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేశాం.. సమాధానం చెప్పలేదు. స్వయంగా ప్రధానిని, ఆహార మంత్రినీ కలిసి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఇక్కడి నుంచి ఫోన్లు చేసినా స్పందించలేదు...' అని ఆవేదన వ్యక్తం చేశారు. గత యాసంగిలో మిగిలిన బియ్యాన్ని కొనుగోలు చేయకపోతే వాటితో దిష్టి తీసి.. బీజేపీ ఆఫీసు మీద గుమ్మరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలపై విజ్ఞప్తులు చేశాం, విజభన హామీలను అమలు చేయాలని కోరాం, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాం...అయినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ తీసుకొచ్చిన దుర్మార్గమైన చట్టాల కింద రైతులు నలిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడాలా..? అని ప్రశ్నించారు. రైతులు, ప్రజల జీవితాలతో ఆటలాడుకోవద్దని మోడీ సర్కారుకు హితవు పలికారు. కేంద్రం దిగిరాకపోతే చావు డప్పు మోగిస్తామని హెచ్చరించారు. ధర్నా తర్వాత దాని నిర్ణయాల ఆధారంగా ముందుకుపోతామన్నారు. రాజకీయ రణం చేయటంలో టీఆర్ఎస్కు మించిన పార్టీ లేదని చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ గుర్తెరగాలనీ, యుద్ధాన్ని ప్రజ్వలింపజేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.