Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన
- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో రాస్తారోకో
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట్ స్టేజ్ వద్ద రైతులు గురువారం రోడ్డెక్కారు. పంటలు కోసి నెలలు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల జాడలేదని వాపోయారు. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిందనీ, తమను పట్టించుకునేవారు లేరని పురుగు మందుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు రైతులు రోడ్డుపై బైటాయించారు. తడిసిన ధాన్యం రోడ్డుపై ఆరబోసి పురుగుమందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. 'ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం' అంటూ నినదించారు. 'తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి' 'కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి' అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై ట్రాక్టర్ అడ్డుగా పెట్టి ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న కామారెడ్డి డీఎస్పీ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, లారీల కొరతతో రోడ్లపైనే ధాన్యం ఉండిపోయిందని వాపోయారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం మొత్తం తడిచిందని వాపోయారు. ఈ ధాన్యం అమ్మకానికి వెళ్తే కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ఏక్యూ 14 శాతం ఉందని చెబితే, రైస్ మిల్లర్లు మాత్రం 20 శాతం ఉందని చెబుతున్నారని వాపోయారు. పంటలు కోసి 27 రోజులవుతున్నా.. ఇంకా కొనుగోలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలన్నీ వర్షానికి తడిసి ముద్దయితే ఇటు ప్రజాప్రతినిధులు కానీ అటు అధికారులు కానీ తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.