Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా కాల్చి ఆనందోత్సాహాలు
- కార్మిక కోడ్లు, విద్యుత్ బిల్లునూ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
నవతెలంగాణ- విలేకరులు
సంవత్సర కాలంగా అన్నదాతలు పోరాడి సాధించిన మూడు వ్యవసాయ నల్ల చట్టాల రద్దుపై రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. శుక్రవారం ప్రధాని మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో రైతుల త్యాగాలు కండ్లముందు కదలాడాయి. ఆ అమరులను స్మరించుకుంటూ.. పోరాటాన్ని కొనియాడుతూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌చౌక్‌లో మిఠాయిలు పంచి, టపాసులు కాల్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని మండలాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి, బాణాసంచా కాల్చారు. ఢిల్లీ సరిహద్దులో ఏడాది కాలంగా రైతులు సాగించిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం రైతాంగ విజయానికి ప్రతీక అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో భాగంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్ మాట్లాడుతూ.. ఈ చట్టాల రద్దు అప్పుడే ప్రకటించి ఉంటే అంతమంది రైతుల ప్రాణం పోయేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు చట్టాలతో పాటు కార్మికులకు నష్టం కలిగించే కోడ్లు, నూతన విద్యా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సూర్యాపేటలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. సీపీఐ(ఎం) కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. అర్వపల్లిలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం), తెలంగాణ జన సమితి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం), బహుజన కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా.
నల్లగొండ జిల్లా కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సుభాష్ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. మునుగోడులో సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో, మిర్యాలగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చారు. నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్ సెంటర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మండలాల్లోనూ విజయోత్సవ ర్యాలీలు తీశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఆలేరు రైల్వే గేట్ సెంటర్లో సీపీఐ(ఎం), సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐఎంఎల్, సీపీయూఎస్ఐ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, సీట్లు పంచారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌లోని ఆ ఎస్ఎఫ్ఐ ఆఫీసులో స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించారు. ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కూడలి వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద మంత్రి తలసాని ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని, రైతుల విజయంగా భావించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రాంనగర్లో అన్నారు.