Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొబ్బరికాయలు కొట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు
- రైతు కన్నీరు పెడితే ప్రభుత్వాలు కూలుతారు
- రోడ్లపై ఆరబోసిన ధాన్యం పరిశీలన : మెదక్, కామారెడ్డి జిల్లాల్లో టీపీసీపీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పర్యటన
నవతెలంగాణ-చేగుంట/కామారెడ్డిటౌన్, భిక్కనూర్, లింగంపేట్, తాడ్వాయి
ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట 45 రోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ రోడ్లపైనే కుప్పలుగా పడి ఉన్నాయనీ, చివరి గింజ వరకూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆఖరికి జడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొనే కేసీఆర్‌కు.. రైతుల వడ్లు కొనే స్తోమత లేదా అని ప్రశ్నించారు. కొబ్బరి కాయలు కొట్టి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన పాలకులు.. వడ్లు కొనకుండా డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వడ్ల కల్లాల్లోకి కాంగ్రెస్ పార్టీ' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటనకు వెళ్తూ.. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివనూర్ గ్రామంలో రోడ్లపై ఆరబోసిన వరిధాన్యం కుప్పల దగ్గర కాసేపు ఆగి రైతులతో మాట్లాడారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజ్ మార్కెట్లో, తాడ్వాయిలో పర్యటించి కొనుగోలు పరిశీలించారు. లింగంపేట్ మండలంలో ఇటీవల వరి కుప్పమీద మృతిచెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి లక్ష రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీలు రైతుల వరి ధాన్యం కొనకుండా వీధి పోరాటాలు చేస్తూ పూటకో మాటమార్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి కోసి పక్షం రోజులు గడిచినా కల్లాల్లోనే ధాన్యాన్ని ఉంచడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. ధర్నాచౌక్‌లో ఏసీలు పెట్టుకుని ధర్నాలు చేయడం కాదు.. కల్లాల్లోకి వచ్చి రైతుల కష్టాలు చూడాలని సూచించారు. కొన్ని రోజులుగా కల్లాల్లో ఉన్న ధాన్యం వానకు తడుస్తూ మొలకెత్తుతున్నాయనీ, ఆ ధాన్యాన్ని కూడా కొనాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజనూ ప్రభుత్వం కొనేంతవరకూ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామనీ, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మద్యం పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు అర్జిస్తూ రైతుల ధాన్యం కొనలేమనడం దారుణమన్నారు. అవస్థలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే గంగారం, కాంగ్రెస్ పార్టీ మెదక్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, కైలా శ్రీనివాస్, నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, మదన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు జమున రాథోడ్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్ధం ఇంద్ర కరణ్ రెడ్డి, నాయకులు సుప్రభాతరావు, గోవర్ధన్, ఆకుల శ్రీనివాస్‌గౌడ్, సుధాకర్ గుర్రాల, తదితరులు ఉన్నారు.