Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చనిపోయిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మోడీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవ డం, క్షమాపణ చెప్పడం గతేడాది నుంచి పోరాడుతున్న రైతుల భారీ విజయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ పోరాటంలో కలిసొచ్చిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రైతాంగానికి, అనేక పోరాటాల సందర్భంగా అవిశ్రాంతంగా కష్టపడిన సీపీఐ(ఎం) కార్యకర్తలకు, ప్రజలందరికీ హదయపూర్వక ధన్యవాదాలు ప్రకటించింది. స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఇంత భారీ ఎత్తున శాంతియుతంగా జరిగిన పోరాటం దేశంలో మరొకటిలేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏడాది కాలంగా సాగుతున్న ఈ పోరాటంపై కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని విమర్శించారు. అనేక రూపాల్లో ఉద్యమాన్ని అణచివేయడానికి యత్నించిందని తెలిపారు. లాఠీఛార్జీలు, అరెస్టులు, తప్పుడు కేసులతోపాటు, ఈ ఉద్యమం వెనక దుష్టశక్తులు, ఉగ్రవాదులు, విదేశీ శక్తులున్నాయనే తప్పుడు ప్రచారం చేసిందని గుర్తు చేశారు. అయినా మొక్కవోని దీక్షతో ఇన్నాళ్లపాటు సాగిన ఈ పోరాటాన్ని జయప్రదం చేయడంలో అన్ని ప్రజాసంఘాలతోపాటు, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీల కషి ఉందని వివరించారు. ఇదే రీతిగా మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలనూ ఎండగట్టాల్సిన అవసరముందని ప్రజానీకానికి ఆయన పిలుపునిచ్చారు.
మూడు వ్యవసాయ చట్టాలతో పాటు, పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లును ఎత్తివేస్తున్నట్టుగాని, ఉద్యమ సందర్భంలో చనిపోయిన 750 మంది రైతులతోపాటు, 12 మంది మేధావుల ఆత్మహత్యలపైగాని, వేలాది మందిపై పెట్టిన అక్రమ కేసులపైగాని ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. మద్దతు ధర, రైతు రుణాల రద్దు ముసాయిదా బిల్లులపై ఎలాంటి నిర్ణయం చెప్పలేదని విమర్శించారు. ఇప్పటికైనా మూడు వ్యవసాయ చట్టాలతోపాటు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ ముసాయిదా బిల్లునూ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని కోరారు. ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని సూచించారు. మద్దతు ధర, రైతు రుణాల రద్దు ముసాయిదా బిల్లును చట్టంగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.