Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోనెసంచులు, తేమపేరుతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
- ఇప్పటివరకు కొన్నది 30శాతం ధాన్యం
- దాంట్లో రైతుల ఖాతాల్లో జమ చేసింది 42శాతమే..
- రైతుల ఆందోళనలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
ధాన్యం కొనుగోళల్లో తమ తప్పేమీ లేదంటే.. తమదేమీ లేదంటూ.. రైతులను అడ్డంగా పెట్టి రాజకీయాలు చేయడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతుంటే.. అన్నదాతేమో.. మీ రాజకీయాలను మాపై చూపొద్దు.. తమ కష్టాన్ని సొమ్ము చేసుకోవద్దంటూ వేడుకుంటున్నాడు. ఆరుగాలం కాయకష్టాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో పోసి అమ్మకాల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాడు. 20రోజులకుపైగా కొనుగోలు కేంద్రాల్లోనే వరి కుప్పల వద్దే పడి ఉంటున్నాడు. వానాకాలం పంట చేతికొచ్చి నెలదాటింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాలు రాసులుగా పోసి రైతులు కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ రాత్రింబవళ్లు ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తుంటే.. అదేమీ పట్టించుకోని ప్రభుత్వాలు.. కేంద్రం లోని సర్కారు ధాన్యం కొనబోమంటుంది.. తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం రోజుకో డ్రామాలాడుతూ పబ్బం గడుపుతున్నాయి. వీళ్ల తగవులాటలో రైతులను పావుగా చేస్తూ.. ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోవడం లేదు. సందట్లో సడేమియాలా వరుణుడు నేనున్నా నంటూ వాలిపోతున్నాడు. దీంతో ధాన్యం తడిసి ముద్దవుతోంది. వరద నీటిలో వడ్లు కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే ఆలస్యం మళ్లీఇప్పుడు తేమ పేరుతో కాంటా వేయకపోవడంతో కరీంనగర్ జిల్లాలోని అన్నికేంద్రాల్లో వారంరోజులకుపైగా ధాన్యం తూకం ఆగిపోయింది.
దిగుబడి అంచనాలో కొన్నది 30శాతమే..
కరీంనగర్ జిల్లాలో 2లక్షల ఎకరాలకుపైగా ఈ వానాకాలం వరి సాగు చేయగా.. దిగుబడి సుమారు 5.5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే వరికోతలు ప్రారంభ సమయంలోనే ఆయా విభాగాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ నుంచి 67, పీఏసీఎస్ 234, డీసీఎమ్ఎస్ 43, మార్కెటింగ్ శాఖ 8 కలుపుకుని మొత్తం 352 కేంద్రాలు పెట్టారు. అందులో 351 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన ఆ కేంద్రాల్లో 335 సెంటర్లలో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. గన్నీ సంచులు, తేమ పేరుతో అవీ నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు ఆయా కేంద్రాల ద్వారా 19వేల 610 మంది రైతుల నుంచి రూ.28.8కోట్ల విలువజేసే లక్షా 47వేల 455 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. ఆయా కేంద్రాల్లో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కుప్పలు ఉంటాయి. ఈ వారం నుంచి మరింత ధాన్యం ఆయా కేంద్రాలకు రైతులు తరలిస్తుండగా స్థలం ఉన్నా.. కాంటాల కోసం 20 రోజుల తరబడి వేచిచూసే పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం దిగుబడి అంచనాలో ఇప్పటి వరకు అధికారులు కొనుగోలు చేసింది 30 శాతం ధాన్యమే. కొనుగోలు చేసిన ఆ ధాన్యానికి సంబంధించి 9వేల 245 మంది రైతుల ఖాతాల్లోనే 61వేల 747 మెట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులు రూ.12.1కోట్లు (42శాతం) మాత్రమే జమ చేయడం గమనార్హం.
వానొస్తున్నా.. వడ్లు కొంటలేరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం నిందించుకుంటూ కాలం వెళ్లదీయ కుండా వెంటనే ధాన్యంకొనుగోళ్లు చేయాలని కరీంనగర్ జిల్లాలోని పలు మండలా ల్లో రైతులు శుక్రవారం ఆందోళనలు చేశారు. ఆయా కేంద్రాల్లో వడ్లను ఆరబెట్టేం దుకు స్థలం లేక, వర్షం వస్తే కుప్పలపై కప్పేందుకు టార్ఫాలిన్ కవర్లు అందు బాటులోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు 'నవతెలంగాణ'తో పలువురు రైతులు వాపోయారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ అధికారుల తీరును నిరసిస్తూ పలువురు రైతులు సెల్‌టవర్ ఎక్కారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మార్కెట్ ఉప కేంద్రంలో ఆందోళనకు దిగారు. వీరికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మద్దతుగా నిలిచారు.