Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేయడాన్ని ప్రజాసంఘాల ఐక్యవేదిక స్వాగతించింది. కనీస మద్దతు ధరల చట్టాన్ని సాధించడంతోపాటు విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరించే వరకు పోరాటం ఆగదని వెల్లడించింది. సాగు చట్టాల రద్దు ప్రకటన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద ప్రజాసంఘాల ఐక్యవేదిక నేతలు టపాసులు పేల్చి విజయోత్సవం నిర్వహించారు. సీట్లు పంచుకున్నారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం సాయిబాబు మాట్లాడుతూ రైతాంగం పోరాటానికి తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుందనీ, ఇది రైతులు సాధించిన చారిత్రాత్మక విజయమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామన్నారు కానీ రైతుల ముందున్న డిమాండ్ల విషయాన్ని ప్రస్తావించలేదన్నారు. అందుకే తమ పోరాటం కొనసాగుతున్నదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిన తరుణంలో మోడీ ప్రకటన చేశారని తెలిపారు. అసోం మినహా ఏప్రిల్, మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయనీ, ఆయా రాష్ట్రాల్లో బీజేపీని ఓడించేందుకు రైతు సంఘాలు 'మిషన్ ఉత్తరప్రదేశ్, మిషన్ ఉత్తరాఖండ్'ను ప్రకటించాయని గుర్తు చేశారు. ఇవాళ మోడీ ప్రకటన చేయడం వెనుక దాగి ఉన్న నిజం ఇదేనన్నారు. సాగు చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ఎన్నో దౌర్జన్యాలు, అసత్య ప్రచారాలు సాగించారని తెలిపారు. కేంద్రం ఎన్నో కుట్రలు చేసిందన్నారు. ఉద్యమంలో ఖలిస్తాన్ వామపక్ష తీవ్రవాదులు ఉన్నారనీ, నిరసనకారులందరూ రైతులేనా అంటూ మోడీ ఆరా తీశారని గుర్తుచేశారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తమ చేతులకు అంటిన మరకను కడిగేస్తామనుకోవడం పొరపాటని చెప్పారు. ఉద్యమంలో 700 మంది రైతులు అమరులయ్యారనీ, అందుకు నరేంద్ర మోడీ, బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అందుకు దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా, సాగు చట్టాల వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు బీజేపీ ప్రభుత్వం తలొగ్గిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ శాసన సభ్యులు నంద్యాల నర్సింహరెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సుభాస్ ముఖర్జీ, దివకరణ్, రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, జె వెంకటేష్, రమ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి అనాదిసాహు, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షులు మహన్, వంగూరి రాములు, టీపీఎస్కే కన్వీనర్ హిమబిందు, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, వత్తి సంఘాల రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్, జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.