Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనిభారంతో ఇబ్బందులు
- తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందనీ, ప్రస్తుతమున్న ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగిందని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి భీంరావు తెలిపారు. హైదరాబాద్లోని ఏఐటీయుసీ కార్యాలయంలో శనివారం జరిగిన యూనియన్ సమావేశంలో మాట్లాడారు. అన్ని ఆస్పత్రుల్లో పడకల సంఖ్య ప్రకారం ఖాళీ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీలో వైద్యశాలలకు సంబంధించి అన్ని క్యాడర్ల అలెవెన్స్ జీవోలను విడుదల చేయాలని కోరారు. గత పీఆర్సీ మాదిరిగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రస్తుత పీఆర్సీలో బేసిక్తో పాటు హెచ్ఆర్సీ , డీఏ కలిపి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని అన్ని ఆస్పత్రుల్లో హెడ్ నర్సు, చీఫ్ రెేడియోగ్రాఫర్, జూనియర్ అనలిస్టు, ప్రమోషన్ పోస్టులను అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేయాలని కోరారు.అన్ని కేటగిరీ ఉద్యోగులందరికీ ఐదంచల ప్రమోషన్ల ప్రక్రియను ప్రవేశ పెట్టాలనీ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎంసీఎస్ రాజు, డి ఈరోజి, యాదయ్య వెంకట్రావు, వి వేణుకుమార్ తదితరులు పాల్గొన్నారు.