Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని సకాలంలో కొనకపోవడం వల్ల వర్షాలకు తడిసిపోయిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి మద్దతు ధరకు కొనుగోలు చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు ఐకేపీ కేంద్రాలను తాను సందర్శించానని తెలిపారు. ప్రభుత్వం వరిధాన్యాన్ని వెంటవెంటనే కొనకపోవడం వల్ల లక్షలాది బస్తాలు ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయాయని పేర్కొన్నారు. ఆ కేంద్రాల్లో తగిన సౌకర్యాల్లేకపోవడం వల్ల ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిందని వివరించారు. రైతులు చేతికందిన పంటను ఐకేపీ కేంద్రాల్లో ఆరబోయడం, కుప్ప నూర్చడానికి ప్రతిరోజూ రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు డబ్బులు ఖర్చు పెట్టుకుని నష్టపో తున్నారని తెలిపారు. ఎండకు ఎండి, వానలకు నానుతున్న ధాన్యాన్ని ఆరబెడుతూ అమ్మడానికి రైతులు రేయింబవళ్లు కాపలాకాస్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం వానాకాలం వరిధాన్యం ప్రతి గింజనూ కొంటుందని ప్రకటిస్తూనే నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఐకేపీ కేంద్రాల్లో పేరుకుపోయిన, తడిసిన వరిధాన్యాన్ని బాధ్యతవహించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.