Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ-గ్రీన్వాచ్ పోర్టల్ పనితీరుపై సమీక్షలో అనూప్ సింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నూతన సాంకేతిక పద్ధతుల వినియోగంలో తెలంగాణ అటవీశాఖ ముందు వరుసలో ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో ఈ-గ్రీన్వాచ్ పోర్టల్ పనితీరుపై సమీక్ష జరిగింది. అటవీ భూముల మళ్లింపునకు కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో పనిచేస్తూ, క్రమానుగత పద్ధతిలో అనుమతులకు వేదికైన పరివేశ్ పోర్టల్, కంపా నిధులతో చేపట్టే ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల పర్యవేక్షణపై చర్చించారు. ఈ పోర్టళ్లను మరింత సరళంగా వాడేందుకు అవసరమైన మార్పులపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. తెలంగాణ అటవీ శాఖ వినియోగిస్తున్న జీఐఎస్( జియోగ్రాపిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), ఎంఐఎస్(మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), రిమోట్ సెన్సింగ్ విధానాలను ఆయన పరిశీలించారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక విభాగాన్ని అరణ్య భవన్లో నెలకొల్పేందుకు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్‌ను అందించేందుకు అనూప్‌సింగ్ ప్రతిపాదించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా పీసీసీఎఫ్ శోభను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ సిద్దానంద్ కుక్రేటీ, ఏ.కే. సిన్హా, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె అక్బర్, డిప్యూటీ కన్జర్వేటర్లు పీ. శ్రీనివాస రావు, ఏ. రామమూర్తి, ఐటీ, సర్వే అధికారులు పాల్గొన్నారు.