Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఓ నెంబర్ 155ని రద్దు చేయాలి
- జీఓ నెంబర్ 27ని వెంటనే పునరుద్ధరించాలి: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి జనార్ధన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పీజీ ఎమ్డీ, ఎమ్ఎస్ ప్రవేశపరీక్షల్లో ప్రభుత్వ వైద్యులకు న్యాయం చేయాలనీ, వెంటనే జీవో నెంబర్ 155ని రద్దు చేయాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి జనార్ధన్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 22వ తేదీ నుంచి సామూహిక సెలవుల్లోకి వెళ్లి పీజీ పరీక్షలకు సన్నద్ధం అవుతామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో నెంబర్ 27ని వెంటనే పునరుద్ధరించాలని మంత్రి హరీశ్‌రావుని కోరారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకురారని హెచ్చరించారు. 2018లో ఇన్‌సర్వీస్ కోటా కింద రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రజారోగ్యవ్యవస్థను బలోపేతం చేయాలంటే కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు పీజీ కోర్సుల్లో రిజర్వేషన్ వర్తింపజేయాలని కోరారు. డీఎమ్ఈ రమేశ్‌రెడ్డి, వీసీ కరుణాకర్‌రెడ్డి కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఇన్ సర్వీస్ వల్ల ఎక్కువ లాభం పొందేది గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వైద్యులేనని చెప్పారు. క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్క్లినికల్ విభాగంలో 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పుట్ల శ్రీని వాస్ మాట్లాడుతూ..గ్రామీణ ప్రాంతాల్లో మూడేండ్లు, గిరి జన ప్రాంతాల్లో రెండేండ్లు, అర్బన్ ప్రాంతాల్లో ఐదేండ్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తే ఇన్‌సర్వీస్ కింద రిజర్వేషన్ వచ్చేదనీ, ఆ పద్ధతిలో వేలాది మంది డాక్టర్లు పీజీ కోర్సు చేసి ఉన్నత స్థానాలకు ఎదిగారని తెలిపారు. పేద డాక్టర్లకు నష్టం చేకూర్చే జీవోను రద్దు చేసేదాకా పోరాడుతామనీ, టీపీహెచ ్డీఏకు మద్దతుగా నిలుస్తామని హామీనిచ్చారు. టీపీహెచ్ డీఏ అధ్యక్షులు కొమ్ము రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ నరహరి మాట్లాడుతూ..ప్రభుత్వ కాలేజీల్లోనే కాదు ప్రయివేటు కాలేజీల్లోనూ ఇన్‌సర్వీస్ రిజర్వేషన్లు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల నిర్ధారణ కమిటీలో డాక్టర్ల సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీపీహెచ్‌డీఏ ఉపాధ్యక్షులు రాంబాబు, కిరణ్, వజీద్, కాంట్రాక్టు డాక్టర్లు, ఈఎస్ఐ ఆస్పత్రి డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
జీవో 155లోని లోపాలు సరిదిద్దాలి
తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డి.హెచ్ విభాగం
జీవో నెంబర్ 155లోని లోపాలను సరిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డీహెచ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి , రాష్ట్ర సెక్రటరీ జనరల్ దీన్ దయాల్ , రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ప్రశాంత్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. జీవో ద్వారా ఇన్ సర్వీస్ కోటాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు, ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో కూడా అమలు చేయాలని పేర్కొన్నారు. పీజీ ఇన్ సర్వీస్ కోటాను ఏజెన్సీ, రూరల్ , అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులకు కల్పించాలని కోరారు. 30 శాతం క్లినికల్, 50శాతం నాన్ క్లినికల్ విభాగాల్లో ఇన్ సర్వీస్ కోటా కల్పించాలని డిమాండ్ చేశారు.