Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాటరీలో మద్యం దుకాణాల కేటాయింపు
- పలు దరఖాస్తులను పక్కన బెట్టిన అధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో/మొఫసిల్ యంత్రాగం
మద్యంలో లాటరీ పద్ధతిలో 'లక్కీ కిక్' పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు కేటాయించారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య లక్కీడ్రా కొనసాగింది. ఒక్కో పేరును అధికారులు ప్రకటిస్తుండటంతో దరఖాస్తుదారులు ఊపిరి బిగపట్టుకుని ఉత్కంఠగా ఎదురు చూశారు. తమకు వస్తుందో రాదోనంటూ ఆందోళనకు గురయ్యారు. దుకాణాలు రానివారు డిపాజిట్ కోసం చేసిన అప్పులను తలచుకుని ఆవేదన చెందారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీకి విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 2620 మద్యం దుకాణాలకుగాను 67వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీడిప్ పద్ధతిన లబ్దిదారులను ఎంపిక చేశారు. ఉదయం నుంచి మొదలైన ప్రక్రియ సాయంత్రానికి పూర్తయింది. ఆయా కేంద్రాలు వద్ద దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలుచోట్ల చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో డ్రా ప్రక్రియ పూర్తయింది. పలుచోట్ల అభ్యర్థులను, దుకాణా దారులను మాత్రమే ఎక్సైజ్ పోలీసులు లోనికి అనుమతించారు. లక్కీడిప్‌లో దుకాణాలు వచ్చిన వారు సంతోషంతో కేకలు వేస్తూ సందడి చేయగా.. రాని వారు నిరాశతో వెనుతిరిగారు. అయితే, కొన్ని చోట్ల దుకాణాలకు ఆశించిన తీరులో దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు వాటిని డ్రాలో వేయకుండా నిలిపేశారు. దాంతో కొంత ఉద్రిక్తతకు దారి తీసింది.
దరఖాస్తులు లేక 14చోట్ల పెండింగ్
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 దుకాణాలు ఉండగా.. 178 దుకాణాలకు లక్కీడిప్ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేశారు. మిగతా 14 దుకాణాల కేటాయింపును పెండింగ్‌లో పెట్టారు. కొందరు మద్యం వ్యాపారులు బినామీ పేర్లతోనూ దుకాణాలు దక్కించుకున్నట్టు తెలిసింది. కుమురంభీం - ఆసిఫాబాద్ జిల్లాలో కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. సిర్పూర్(యు), లింగాపూర్ మండల కేంద్రాల్లోని దుకాణాలకు రెండేసి దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు ఆ దుకాణాలకు లక్కీడిప్ నిర్వహించలేదు. దీంతో ఆగ్రహించిన దరఖాస్తుదారులు కలెక్టర్ రాహుల్‌రాజ్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
ఒక్క దుకాణాన్ని పక్కన బెట్టిన అధికారులు
హైదరాబాద్‌లో ఎక్సైజ్ డివిజన్లోని హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని రెండు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో మొత్తం 179 షాపులుండగా.. 2200కుపైగా దరఖాస్తులు వచ్చాయి. అంబర్‌పేట్‌లోని రాణాప్రతాప్ సింగ్ ఫంక్షన్ హాల్లో లక్కీడ్రా ద్వారా దుకాణాలను కేటాయించారు. ఒక్క దుకాణానికి డ్రా ప్రక్రియ నిలిపేశారు.
మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్లో నిలిచిన 4 దుకాణాలు
మహబూబ్‌నగర్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, కోస్గీ, నారాయణపేట ప్రాంతాల్లోని మొత్తం 90 దుకాణాలకుగానూ 88 దుకాణాలకు లాటరీ తీశారు. రెండింటిని పక్కనబెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొత్తం 67 దుకాణాలకుగాను 1507 దరఖాస్తులు వచ్చాయి. అందులో 65 దుకాణాలకు లక్కీ డీప్ తీసి.. రెండింటిని పక్కనబెట్టారు. గద్వాల జిల్లాలో 36 దుకాణాలకు.. 987 దరఖాస్తులు వచ్చాయి. అందులో 33 దుకాణాలకు లాటరీ పద్ధతిలో కేటాయించారు. మూడు పెండింగ్‌లో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని కమ్మ వారి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతి రాజ్ కమిషనర్ డాక్టర్ శరత్ డాక్టర్ శరత్ మద్యం షాపులను డ్రా పద్ధతిలో తీసి కేటాయించారు. జిల్లాలోని 88 మద్యం షాపులకు సుమారు 4271 టెంటర్లు దాఖలయ్యాయి.