Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామమాత్రంగా ధాన్యం కొనుగోళ్లు
- ఖమ్మం జిల్లాలో తెరుచుకున్న 110 కేంద్రాలు
- తేమ పేరుతో కొర్రీలు
- ఇప్పటి వరకు కొన్నది 1400 క్వింటాళ్లే..!
- తక్కువకు కొంటున్న బయటి వ్యాపారులు
- రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి
ధాన్యం కొనుగోళ్లు నెలరోజులవుతున్నా నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. దాదాపు పదిపన్నెండు రోజుల కిందట కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నా ఇప్పటి వరకు నామమాత్రంగానే కొనుగోళ్లు జరిగాయి. కల్లాలు, కేంద్రాల్లో ధాన్యం రాసుల వద్ద రైతులు రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. ఇదే సమయంలో వరుణుడు నేనున్నానంటూ పరిగెత్తుకొస్తున్నాడు. రైతుల ఆరుగాలం కష్టాన్ని నిమిషాల్లో నీళ్లపాలు చేస్తున్నాడు. కండ్ల ముందే ధాన్యం తడిసి, కొట్టుకుపోతున్నా.. చూడటం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరేమో ఇన్ని కష్టాలు, ఖర్చులు భరించలేక బయటి వ్యాపారులకు వచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1,400 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. 'ఆదిలోనే హంసపాదు' అనే రీతిలో మొదటి నుంచే కొర్రీలు పెట్టారు. అధిక తేమ పేరుతో ధాన్యం కొనేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి ఎదురు చూడటం.. అదనపు ఖర్చులు భరించలేక రైతులు బయటి వ్యాపారులకు బస్తా (75 కిలోలు) రూ.1,100కే అమ్ముకుంటున్నారు. ఈ లెక్కన క్వింటా రూ.1400 నుంచి 1500 పడుతోంది. సత్తుపల్లి మండలంలో పది రోజుల కిందట పది కొనుగోలు కేంద్రాలు తెరిచారు. ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఇంత వరకు గింజ ధాన్యం కొనలేదు. గత్యంతరం లేక రైతులు గ్రేడ్-ఏ రకం ధాన్యం బస్తా రూ.1,100 చొప్పున బయటి వ్యాపారులకు అమ్ముతున్నారు. గ్రేడ్-2 రకం ధాన్యం రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారు. మండలంలోని గంగారంలో పది రోజుల కిందట కొనుగోలు కేంద్రం ఓపెన్ అయింది. సుమారు 300 మంది రైతులు టోకెన్లు రాయించుకుని సీరియల్లో ఉన్నారు. కానీ ఇంతవరకూ గింజ కొనలేదు. కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమైతే బయటి వ్యాపారులు కూడా కొంత ధర ఎక్కువ పెడతారని రైతులు ఆశిస్తున్నారు.
అరకొర కొనుగోళ్లలోనూ కొర్రీలు..
అరకొర కొనుగోళ్లలోనూ కొరీల్రు పెడుతున్నారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఓవైపు వర్షాలు కురుస్తుండటం.. నిత్యం వాతావరణం మేఘావృతమై ఉంటున్న సమయంలో ధాన్యంలో తేమ లేకుండా ఎలా చేయగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తేమ శాతం 17 పాయింట్లకు మించి వస్తుండటంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. దీనికితోడు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా, ఆధార్‌కార్డు, ఓటీపీ నంబర్ నమోదు.. ఇలా రకరకాల కొర్రీలు పెడుతుండటంతో చేసేది లేక రైతులు బయటి వ్యాపారులకు అత్తెసరు ధరలకే అమ్ముకుంటున్నారు. క్వింటా దాదాపు ఎక్కువగా రూ.1200కే అమ్ముకుని రూ.700కు పైగా నష్టపోతున్నారు.
నిర్వాహకులదే బాధ్యత..
రాష్ట్రవ్యాప్తంగా 6వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో 179 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా ధాన్యం నాణ్యత పరిశీలన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అప్పగించారు. ధాన్యం నాణ్యతలో ఏమైనా ఇబ్బందులుంటే వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి నిర్వాహకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ధాన్యం గ్రేడ్-1 క్వింటాలుకు రూ.1960, గ్రేడ్-2 రూ.1940 చొప్పున కొనాలని నిర్ధారించారు. తేమ శాతం 17 పాయింట్లకు మించితే కొనుగోలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ధాన్యం తీరు
ఖమ్మం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో వరి సేద్యం చేశారు. సుమారు 6 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 8 బాయిల్డ్, 48 రా రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లులకు 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చే కెపాసిటి ఉంది. సీజన్‌కు సరిపడా మొత్తం 61 లక్షల గన్నీ బ్యాగ్‌లు అవసరమవుతాయని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతానికి 7 లక్షల గన్నీ బ్యాగ్‌లు సిద్ధంగా ఉంచారు. డీజిల్ చార్జీలు పెరిగిన దృష్ట్యా గతంలో ట్రాన్స్పోర్ట్ చేసిన రేటు కంటే ఈసారి 45% ధర పెంచాలని లారీ ఓనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్య ఇంకా కొలిక్కిరానట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 110 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా.. ఇంకా 69 కేంద్రాలను తెరవలేదు.
- ఇతర జిల్లాల్లోనూ..
నవతెలంగాణ మొఫసిల్ యంత్రాంగం
యాదాద్రి జిల్లాలో 5 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ధాన్యం కొనుగోలు కోసం 271 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇప్పటి వరకూ 2124 మంది రైతుల నుంచి 14315 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. నల్లగొండ జిల్లాలో 11,63,427 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి.. 184 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
సూర్యాపేట జిల్లాలో 11,26,848 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. 276 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 884 మంది రైతుల నుంచి 6402 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వేములపల్లి మండలం ఆమనగల్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకొచ్చిన దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. కేంద్రంలోనే ధాన్యపు రాశులు కుప్పలుగా పోసి ఉన్నాయి. లారీల కొరత ఉన్నందున కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని రైతులు చెబుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 550 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం అనుమతులు వచ్చినప్పటికీ మహబూబ్‌నగర్ జిల్లాలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతా చోట్లా మరో ఐదారు మాత్రమే ప్రారంభించారు. కానీ ఎక్కడా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 165 కొనుగోళ్లు సెంటర్లు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో 411 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి 408 సెంటర్లను ప్రారంభించారు. మెదక్ జిల్లాలో 361 కొనుగోలు సెంటర్లకు 195 సెంటర్లను ప్రారంభించారు. కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్, మరికొన్ని చోట్ల గన్నీ బ్యాగుల కొరతతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నెల రోజులు దాటినా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరని.. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇటీవలే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. హత్నూర మండలంలో కూడా రైతులు ధర్నా చేశారు.
మెదక్ జిల్లా చిలిఫిచెడ్ మండల పరిధిలోని 12 కొనుగోలు సెంటర్లలో ట్రాన్స్పోర్ట్ సమస్య వెంటాడుతున్నది. లారీలు రాకపోవడంతో సెంటర్లలో ధాన్యం పేరుకుపోతున్నది. టేక్మాల్ మండల పరిధిలో గల కొనుగోలు సెంటర్లలో మిల్లర్లు తూకంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో రోజుల తరబడి మిల్లుల దగ్గర రైతులు వేచి చూడాల్సిన దుస్థితి. దీంతో విసిగిపోయిన రైతులు శుక్రవారం రైస్ మిల్లు ఎదుట ధర్నా చేపట్టారు. దీనికి తోడు కొనుగోలు చేసేటప్పుడు 40 కిలోల బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారని రైతులు చెబుతున్నారు. బస్తాపై అదనంగా రెండు కిలోల ధాన్యాన్ని తరుగు తీసుకోవడంతో క్వింటాలుకు 5 కిలోలు నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.
వొడ్లు తెచ్చి వారమైంది.. కాంటా పెడుతలేరు
సెంటర్‌కు వడ్లు తెచ్చి వారం రోజులైంది. కొంటలేరు. రైస్ మిల్ యజమానులు తూకం వేయకపోవడంతో.. ఎక్కడి ధాన్యం అక్కడే పేరుకుపోతుంది. మరోపక్క వర్షం వచ్చేలా ఉంది. చేతికందిన వడ్లు నీటిపాలవుతాయని భయంగా ఉంది.
- కుమ్మరి మల్లయ్య, రైతు (కొత్తపల్లి, మెదక్ జిల్లా)
కొనుగోలు కేంద్రం తెరవలేదు
మూడెకరాల్లో వరి వేశాను. ధాన్యం ఆరబెట్టాను. రోజూ వాతావరణం మబ్బులు పట్టి ఉండటం, అప్పుడప్పుడు వర్షం వస్తుండటంతో ధాన్యం ఆరేలా లేవు. తిరగబోసేందుకు ఇబ్బంది అవుతోంది. గ్రామంలో గతేడాది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంకా ఏర్పాటు చేయలేదు. పక్క గ్రామం గంగారంలో అమ్ముకుందామన్నా ఇప్పటికే అక్కడ 300కు పైగా సీరియల్ ఉందని తెలిసింది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు.
- కాకాని శ్రీనివాసరావు, బేతుపల్లి, సత్తుపల్లి మండలం
ధాన్యంలో అధిక తేమ ఉంది
ప్రస్తుతం వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ధాన్యం కోతలు కూడా ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ధాన్యం పచ్చిగా ఉంటుండటంతో తేమశాతం అధికంగా వస్తోంది. చెదురుమదురుగా వానలు కూడా కురుస్తుండటంతో తేమ తగ్గేలా లేదు. నిబంధనల ప్రకారం తేమ శాతం ఉంటేనే కొనుగోళ్లు సాధ్యమవుతాయి.
- రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి