Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువకుడి మృతి
- గజ్వేల్- చేగుంట రహదారిపై మృతదేహంతో గ్రామస్తుల ధర్నా
నవతెలంగాణ-రాయపోల్
చదువుకుంటూనే పొలం పనుల్లో తండ్రికి సాయంగా నిలిచాడు.. పుస్తకాలు పట్టుకున్న చేతులతోనే.. వరికట్టలు మోస్తూ తల్లిదండ్రుల కష్టాన్ని పంచుకున్నాడు. చిన్నతనంలోనే తమ కష్టాన్ని, కన్నీళ్లను పంచుకుంటున్న కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. భవిష్యత్లో మంచి స్థాయికి ఎదిగి కుటుంబాన్ని పోషిస్తాడనుకున్నారు. కానీ ఇంతలోనే విద్యుత్ తీగల రూపంలో వచ్చిన మృత్యువు ఆ యువకుడిని కబలించింది. పొలం పనుల్లో భాగంగా నాగలి మొస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హృదయ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లిలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
వడ్డేపల్లి గ్రామానికి చెందిన జనముల శ్యామ్నాథ్ది వ్యవసాయ ఆధారిత కుటుంబం. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమారుడు జనముల గణేష్(18) డిగ్రీ చదువుకుంటూ తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. రోజులాగే శనివారం ఉదయం గణేష్ తండ్రితో కలిసి పొలానికి వెళ్లాడు. అక్కడ శ్యామ్నాథ్ డ్రిప్ పైపులు సరి చేస్తుండగా... కుమారుడిని పక్కన వ్యవసాయ పొలంలో ఉన్న తమ ఇనుప నాగలిని తీసుకురమ్మని పంపించాడు. గణేష్ ఇనుప నాగలిని భుజంపై పెట్టుకొని తెస్తున్నాడు. ఈ క్రమంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు ఇనుప నాగలికి తగలడంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు ఎంతసేపటికీ రాకపోయేసరికి శ్యామ్నాథ్ వచ్చి చూసేసరికి గణేష్ విగతజీవిగా పడిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గణేష్ మృతదేహంతో గజ్వేల్-చేగుంట రహదారి గుర్రాల సోఫా చౌరస్తాలో ధర్నా చేశారు. విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా తక్కువ ఎత్తులో కిందికి వేలాడుతున్నాయని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ నామమాత్రంగా కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కారం చేశారన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన జరిగిందని, గణేష్ కుటుంబానికి సరైన న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, గ్రామస్తులు, విద్యుత్ అధికారులు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో సంప్రదింపులు జరిపి బాధిత కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గ్రామంలో గణేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రాయపోల్ ఎస్ఐ షేక్ మహబూబ్ తెలిపారు.