Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షమాపణలు చెప్పి, చేతులు దులుపుకుంటే చాలదు
- ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
- కేసులన్నీ ఎత్తేయాలి
- రాష్ట్రం నుంచి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షలు ఇస్తాం
- ధాన్యం కొనుగోలుపై వార్షిక లక్ష్యం ఇవ్వాలి
- విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
- కనీస మద్దతు ధర చట్టం తేవాలి
- వానాకాలం పంటలో ప్రతి గింజా కొంటాం
- ఎస్టీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వండి
- జనగణనలో కుల గణన చేపట్టాలి
- నేడు మంత్రులు, అధికారులు, ఎంపీలతో ఢిల్లీకి సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ధాన్యం కొనుగోలు సహా అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్పష్టంచేశారు. దానికోసం ఆదివారం మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలతో కలిసి తాను ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిపారు. శనివారంనాడిక్కడి తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మట్లేదని అన్నారు. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా గుర్తించి, మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తున్నట్టు ప్రకటించి, ప్రజలకు క్షమాపణలు చెప్పిందన్నారు. విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలనీ, రైతుల పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) చట్టాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తేవాలని డిమాండ్ చేశారు. దీనికోసం సాగే పోరాటంలో తాము భాగస్వామ్యమవుతామని చెప్పారు. చట్టాలు రద్దుచేసి, రైతాంగానికి క్షమాపణలు చెప్తే చాలదనీ, కేంద్రప్రభుత్వం బేషజాలకు వెళ్లకుండా ఈ ఉద్యమంలో మరణించిన ఒక్కో రైతు కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. రైతు ఉద్యమంలో వివిధ కారణాలతో 700 నుంచి 750 మంది వరకు రైతులు ప్రాణత్యాగం చేశారనీ, వారి జాబితా ఇవ్వాలని రైతు సంఘటన్ నాయకులను కోరినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరణించిన ఒక్కో రైతు కుటుంబానికి రూ.3 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామన్నారు. దీనికోసం రూ.22.50 కోట్లు ఖర్చవుతుందనీ, ఇది వారి పోరాటాన్ని గౌరవించడమేనని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదీజలాల వివాదంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రం వాటా ఎంతో తేల్చడానికి ఉన్న అడ్డంకులు ఏంటని ప్రశ్నించారు. కేంద్రం చెప్పినట్టు సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్నామని చెప్పారు. ట్రిబ్యునల్ వేయగానే సరిపోదనీ, నిర్ణీత కాలపరిమితిలో నీటి వాటాలు తేల్చాలని కోరారు. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై కేంద్రానికి ఇప్పటికే అనేకసార్లు లేఖలు రాసామనీ, నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారనీ, ఇది సరికాదని అన్నారు. తమిళనాడు తరహాలో తాము కూడా రిజర్వేషన్లు పెంచుకుంటామని కేంద్రానికి లేఖరాస్తే, స్పష్టత ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. జనగణనలో తప్పనిసరిగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల లెక్కలు తేల్చాలని డిమాండ్లు వస్తున్నాయనీ, అవి చేపడితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని అడిగారు. దేశంలో కులం ఉన్న విషయం అందరికీ తెలిసిందేననీ, ప్రభుత్వాలే కులం సర్టిఫికెట్లు ఇస్తున్నాయని ఉదహరించారు. ఎస్సీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామనీ, అనేక లేఖలు రాసామనీ, ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. ''అవునో...కాదో చేప్పేయాలి'' అని అన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం స్పష్టత ఇవ్వకుంటే గిరిజన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. 'అనురాధ కార్తె అప్పుడే వచ్చింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో వార్షిక లక్ష్యం ప్రకటించమని కేంద్రాన్ని కోరాం. దీనిపై కేంద్రం తక్షణం స్పందించాలి' అని అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ, రైతులను ఆగం చేస్తే సహించేది లేదన్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనాల్సిందేనన్నారు. రాష్ట్రంలో 58.66 లక్షల ఎకరాల్లో వరిపంట వేశారని కేంద్రమే ప్రకటించిందని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై వార్షిక లక్ష్యం ప్రకటిస్తే, దానికి అనుగుణంగా తాము రాష్ట్రంలో రైతులతో పంటలు వేయిస్తామని స్పష్టం చేశారు. వానాకాలం పంటలో చివరి గింజవరకు ధాన్యాన్ని కొంటామని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 6,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయనీ, అవసరమైతే వాటి సంఖ్య పెంచుతామన్నారు. రైతులు అగమై ఇప్పటికిప్పుడు పంటలు కోయవద్దనీ, వర్షాలు తగ్గాక కొంచెం టైం తీసుకొని కోతలకు వెళ్లాలని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై కొందరు రాజకీయ బేహారులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారనీ, అలాంటి చిల్లరగాళ్ళ పనులతో గందరగోళానికి గురి కావొద్దన్నారు. విద్యుత్ సవరణ చట్టాన్ని(బిల్లును) ఉపసంహరించుకోవాలనీ, దానికోసం పార్లమెంటులో కొట్లాడతామని చెప్పారు. ప్రతిబోరు దగ్గర మీటరు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తున్నదనీ, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాలపై ఇలాంటి షరతులు తగదని అన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొన్నారు.