Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులను ఇండ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలలో (బాలికలు) 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తన స్వగ్రామమైన ఏనుకూరు మండలం తూతక లింగన్న పేటలో ఫంక్షన్కు వెళ్లి తిరిగి పాఠశాలకు వచ్చింది. ఆ విద్యార్థిని పాఠశాలకు వచ్చిన తర్వాత జలుబు, జ్వరంతో బాధపడుతుండగా ఉపాధ్యాయులు గమనించి కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ విద్యార్థినితో పాటు శనివారం పాఠశాలలోని విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆదివారం సుమారు 500 మందికి పరీక్షలు చేయగా మరో 20 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం 28 మందికి పాజిటివ్ రావటంతో ఆందోళనతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ లక్ష్మిని వివరణ కోరగా.. పాఠశాలలో కోవిడ్ నిబంధనల ప్రకారం నడుపుతున్నామనీ, కాని విద్యార్థినులు వారి ఇండ్లకు వెళ్లిన సందర్భంలో జరిగే ఫంక్షన్లలోనే వైరస్ ఎటాక్ అవుతుందని తెలిపారు. కరోనా పాజిటివ్ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులూ భయంతో తమ పిల్లలనూ ఇండ్లకు తీసుకెళుతున్నారు.