Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూపునకు రూ.1000 ఇస్తేనే కార్మికులకు హాజరు
- లేదంటే వేతనంలో కోత
- పట్టించుకోని ఉన్నతాధికారులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పారిశుధ్య విభాగం కీలకంగా ఉంది. ఒక్కరోజు ఈ విభాగం పనిచేయకపోతే నగరమంతా కంపుకొట్టే ప్రమాదముంది. ఈ విభాగంలో పారిశుధ్య కార్మికులు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు, జవాన్లను సమన్వయం చేయడానికి అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు. కానీ పారిశుధ్య నిర్వహణ, సమన్వయం తప్ప అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు (ఏఎంఓహెచ్) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తు న్నారు. ప్రజారోగ్యశాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన మెడికల్ ఆఫీసర్లు జీహెచ్ఎంసీలో తిష్టవేశారు. సమయం ముగిసినా ఇక్కడే ఉంటున్నారు. అందుకు కోట్లరూపాయలు కొల్లగొట్టడానికే జీహెచ్ఎంసీని వదలడంలేదని పలువురు పారిశుధ్యకార్మికులు, కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించింది. ఆరుజోన్ల లో 30 సర్కిళ్లు ఉన్నాయి. గ్రేటర్‌ను శుభ్రం చేయడా నికి 18,500లకుపైగా పారిశుధ్యకార్మికులు పనిచేస్తు న్నారు. పారిశుధ్య కార్మికులకు చెందిన 2,600 గ్రూపులున్నాయి. వీటిని పనిచేయించడానికి 950 మంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎస్ఎఫ్ఏ) ఉన్నా రు. వీరితోపాటు సూపర్వైజర్లు, జవాన్లు ఉన్నారు.
లక్షల్లో ఆదాయం
జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుధ్య కార్మికులకు హాజరువేయాలన్నా, అనుమతి తీసుకుని సెలవు తీసుకున్న ముడుపులు చెల్లించక తప్పడంలేదని పలువురు కార్మికులు వాపోతున్నారు. ఇలా ఒక్కో గ్రూపు నుంచి నెలకు రూ.1000 సమర్పించుకోవాల్సిందే. వీటితోపాటు కాంట్రాక్టర్ల బిల్లులపై సంతకాలు చేయడానికి కనీసం 2శాతం కమీషన్ ఇవ్వాల్సిందే. అయితే మరణించిన/60ఏండ్లకుపైబడిన కార్మికుని భార్య/భర్త, మేజర్ కుమారుడు/కుమార్తె, మనుమడు/మనుమరాలు, ఎవరూలేకపోతే సంరక్షకులకు అవకాశమివ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీరిలో ఎవరూ లేకపోయిన సంబంధిత కార్మికుని జీవనోపాధిని కల్పించడానికి చర్యలు తీసుకోవాలని బల్దియా నిర్ణయించింది. కాని 60ఏండ్లకుపైబడిన కార్మికులు, మరణించినవారి స్థానాల్లో సంబంధిత కుటుంబానికి చెందినవారిని కొత్తగా తీసుకోవడానికి రూ.4-5లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కొత్తవారిని తీసుకోవాలన్నా, వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలన్నా జోనల్ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాని మెడికల్ ఆఫీసర్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని పలువురు అధికారులు చెబుతున్నారు.
అవినీతి మరకలు.. అయినా
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్లలో అవినీతి మరకలు ఉన్నవారే ఎక్కువ. ఓ మెడికల్ ఆఫీసర్‌పై జనన, మరణ ధృవపత్రాల జారీలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. జనన, మరణ ధృవపత్రాలు జారీచేయడానికి డబ్బులు అడిగితే ఓ పౌరుడు గన్‌తో బెదిరించినట్టు జోరుగా ప్రచారం జరిగింది. మరో మహిళా మెడికల్ ఆఫీసర్‌పై నకిలీ హాజరు ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యనే ఓ మెడికల్ ఆఫీసర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో తన సొంత శాఖకు వెళ్లిపోయింది. ఖైరతాబాద్ జోన్లో ఓ మెడికల్ ఆఫీసర్ 11ఏండ్లుగా ఒకే దగ్గర పనిచేస్తున్నాడు. చార్మినార్ జోన్లో మరో మెడికల్ ఆఫీసర్ 8 ఏండ్లు, ఇంకో మెడికల్ ఆఫీసర్ ఆరేండ్లుగా పనిచేస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అవినీతి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదని, ఆరోపణలు రాగానే సొంత శాఖలకు పంపిస్తున్నారని విమర్శలూ వస్తున్నాయి.