Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగునీటి శాఖలో విపరీత పరిణామాలు
- మూడో ట్రిబ్యునల్ కావాలంటున్న నిపుణులు
- చోద్యం చూస్తున్న కేంద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలుగురాష్ట్రాల్లో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న జలవివాదాలను పరిష్కరించాల్సిన కేంద్రంలోని బీజేపీ సర్కారు చోద్యం చూస్తున్నది. రాష్ట్రాలు తగాదా పడుతున్నా మిన్నకుంది. సరికదా గెజిట్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ట్రిబ్యునల్ ఏర్పాటులో తీవ్ర ఆలస్యం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించడానికి ట్రిబ్యునల్‌ను కచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది ఆయా రాష్ట్రాల హక్కు.. కేవలం కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులను మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. వీటితో సమస్యలు కొలిక్కి రాలేదు సరికదా ఇంకా పెరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని ఆయా ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలన్న కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల నేపథ్యంలో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డులు తమ పనిని ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల్లోని ఆయా ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని అడుగుతున్నాయి. ఆయా ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. గత రెండు వారాలుగా ఈ ప్రక్రియ సాగుతున్నది.
గెజిట్‌కు భిన్నంగా..
నిజానికి గత నెల 14కు ముందే ఆయా ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి రావాలి. ఇందులో జాప్యం జరుగుతున్నది. ఇందుకూ కేంద్రం బాధ్యతారాహిత్యమే. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తెచ్చేందుకు ఏపీ అంగీకరించింది. కాగా తెలంగాణ మాత్రం నిరాకరించింది. ఇందుకు గెజిట్‌ను కేంద్ర జలశక్తి శాఖ అమలుచేయకపోవడం. 1974కు ముందు నిర్మించిన పాత ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తేవాల్సిన అవసరం ఉండదు. కానీ కేంద్రం అన్నీ ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవాలని ఆదేశించింది. ఇది గెజిట్‌కు వ్యతిరేకం. ఈనేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అన్ని ప్రాజెక్టులను అప్పగించడానికి ససేమిరా అంటున్నది. ఈ వైఖరిని సాగునీటిరంగ నిపుణులు సైతం సమర్థిస్తున్నారు. గెజిట్‌కు భిన్నంగా కేంద్రం ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
కొత్త వివాదం
కేఆర్ఎంబీ సబ్‌కమిటీ గత మంగళవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పర్యటన సందర్భంగా మరో కొత్త వివాదం తలెత్తింది. ప్రాజెక్టు పరిధిలో పర్యటించడానికి కేఆర్ఎంబీ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. అందుకే వారిని ఆ ప్రాజెక్టు పరిశీలనకు స్థానిక అధికారులు అనుమతించలేదని సమాచారం. దీంతో ఈ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. పాత సమస్యను పరిష్కరించే క్రమంలో కొత్త వివాదాలు తలెత్తడం పట్ల సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అపెక్స్ కౌన్సిల్ జాడేది ?
వివాదాల పరిష్కారంలో కీలకపాత్ర పోషించాల్సిన అపెక్స్ కౌన్సిల్ తరచుగా భేటి కావడం లేదు. దీనికి కారణం కేంద్ర జలశక్తి శాఖ. ఆ శాఖ ఆధ్వర్యంలోనే ఎప్పటికప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశాలు జరగాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాగునీటి రంగ నిపుణులు ఈ కౌన్సిల్లో సభ్యులు. ఆ కౌన్సిల్ ఆశించిన మేరకు చొరవచూపకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లేఖల పేరుతో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్నది. కేంద్రం నాన్చివేత వైఖరి మూలంగా వివాదాల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతూ సాగదీతకు అవకాశం ఏర్పడుతున్నది.
మూడో ట్రిబ్యునల్
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి తొలుత 1975లో బచావత్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. వివాదాలేవీ కొలిక్కిరాలేదు. మళ్లీ 2010లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను నియమించారు. దీని తీర్పు ఇంకా రాలేదు. ఈట్రిబ్యునల్ ఇప్పుడు ఉనికిలో ఉందా ? లేదా ? అనేది ప్రశ్నార్థకం. దీంతో సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. పునర్విజన చట్టంలోని సెక్షన్ మూడు ప్రకారం కొత్తగా మూడో ట్రిబ్యునల్‌ను వేయాలి. అప్పుడే రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ఈ జల సమస్యలు పరిష్కారమవుతాయని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వివాదమున్న ప్రాజెక్టులను మాత్రమే బోర్డులకు అప్పగించాలని అంటున్నారు. రాష్ట్రాల మీద విశ్వాసం ఉంచకుండా కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇది రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తుందని అంటున్నవారూ ఉన్నారు. ఈ పరిస్థితులు తగాదాలు మరింత పెరగడానికి ఉపయోగపడతాయే తప్ప తగ్గవని చెబుతున్నారు. కాగా బయటి రాష్ట్రాల అధికారులతో ఏర్పాటైన బోర్డుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలే నిధులు మంజూరు చేస్తున్న విషయం విదితమే. వీటి కోసం ప్రతియేటా రూ. 200 కోట్లు కేంద్రం ఖాతాలో డిపాజిట్ చేయాలని మోడీ సర్కారు షరతు పెట్టిన సంగతీ తెలిసిందే.