Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాణం మీదికొస్తే ఆస్పత్రుల చుట్టూ పరుగులే...
- నో అంటున్న కార్పొరేట్ ఆస్పత్రులు
- డబ్బు చెల్లిస్తేనే వైద్యం
- నిమ్స్‌లోనూ బోలెడన్ని ఆంక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆ కార్డులుంటే చాలు...అత్యవసర పరిస్థితిలో ఏ ఆస్పత్రిలోనైనా చేరి ప్రాణాలు కాపాడుకోవచ్చని భావిస్తారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే తప్ప అర్థం కాదు... అవే అనారోగ్యం పాలయ్యాయని. కార్పొరేట్ ఆస్పత్రులు నో అంటూ, డబ్బు చెల్లిస్తేనే వైద్యమంటుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి. కనీసం నిమ్స్ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకుందామంటే అక్కడా ఆంక్షలతో చుక్కెదురు. రాష్ట్రంలో హెల్త్ కార్డులున్నా... ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పాలకులు చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. ఆయా వర్గాల కోసమంటూ ప్రారంభించిన అనేక స్కీంలు కాలగమనంలో మసకబారుతున్నాయి. వాటి లోటుపాట్లను సరిదిద్దే ఆసక్తి కనిపించ డం లేదు. ప్రజాసంఘాల సుదీర్ఘపోరాటం, తీవ్ర ఒత్తిడి తర్వాత మొదలుపెట్టిన పథకాల విషయంలోనూ ఇదే పోకడ. అప్పుడప్పుడు దానిపై సమీక్షించినా క్షేత్రస్థాయిలో దాని ప్రక్షాళనకు పూనుకోకపోవ డంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. ప్రభుత్వా స్పత్రుల్లో డాక్టరుంటే సౌకర్యులుండవు సౌకర్యాలున్న చోట డాక్టర్లుం డరు. ఇద్దరూ ఉంటే మిగిలిన సిబ్బంది కొరత వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు జర్నలిస్టులు వారి కుటుంబసభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్త్ కార్డులను అందజేసింది. ప్రాథమికంగా ఓపీ స్థాయిలో చూయించుకునేందుకు ఆయా జిల్లాల్లో 14 వెల్ నెస్ సెంటర్లను నెలకొల్పిన సంగతి తెలిసిందే. రోగం ముదిరి, అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్లుగా చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటున్నది. ఎక్కువమంది అవుట్ పేషెంట్లుగా డాక్టర్లను సంప్రదించి సిఫారసు చేసిన పరీక్షలు చేయించుకుని మందులను వాడుతున్నారు. డయాబెటిస్ రోగులైతే వారికి కేటాయించిన నిర్దిష్ట గడవుల్లో మందులు పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా వెల్నెస్ సెంటర్లు పరీక్షల సంఖ్యను తగ్గించాయి. ఆ కొన్ని పరీక్షలు కూడా చేయకుండా కేవలం నమూనాలను సేకరించే కేంద్రాల స్థాయికి తగ్గాయి. సేకరించిన నమూనాలను తెలంగాణ డయాగస్టిక్ సెంటర్ కు పంపిస్తున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. ఇక డాక్టర్లు సిఫారసు చేసిన మందుల విషయంలోనూ పూర్తిగా దొరకకపోవటంతో బయట కొనుక్కోవాల్సి వస్తున్నదని బాధితులు అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేసిన విదితమే. ఈ పరిస్థితిని చక్కదిద్దుతామనీ, అందరికి మెరుగైన వైద్యం అందిస్తామని రాష్ట్ర సర్కార్ పదే పదే చెప్పిన మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. సాధారణ పరిస్థితుల్లో ఏదోలా సర్దుకుపోయినా అత్యవసర పరిస్థితుల్లోనూ హెల్త్ కార్డు అక్కరకు రాకపోవటంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 20 వేల మందికి పైగా జర్నలిస్టులతో పాటు దాదాపు నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, రెండు లక్షల మంది పెన్షనర్లకు హెల్త్ కార్డులను కలిగి ఉన్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తగానే కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ స్పెషాలిటీ డాక్టర్లు, ఇతర సౌకర్యాలుండటం, పలువురు డాక్టర్లు సైతం ఆయా ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం తమ వద్ద హెల్త్ కార్డులు అనుమతించటం లేదని తేల్చి చెబుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుగా ఓపీ చూయించుకోవాలనీ, అది కూడా కేటాయించిన రోజుల్లోనే చూయించుకోవాలని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈఎస్ఐలోనూ ఆంక్షలే....
ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించటం ఏ సంక్షేమ రాజ్యానికైనా ప్రాథమిక విధిగా ఉండాలి. అందు కోసం ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. అది చేయకపోగా, కార్మికులకు మెరుగైన ఆరోగ్యం అందించాల్సిన ఈఎస్ఐ ఆస్పత్రులు సైతం ఆంక్షలతో వేధిస్తున్నాయి. ఈఎస్ఐలో చేరి ఏడాది గడువులోపు వారికి స్పెషాలిటీ వైద్యం అవసరమైతే అందుకు సిఫారసు చేసేందుకు నిరాకరిస్తున్నాయని బాధితులు వాపోతున్నారు.
ఆరోగ్య సిబ్బందికీ కష్టాలే....
వారంతా రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అందరితో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. కాని వారి ఆరోగ్యానికి మాత్రం భద్రత ఉండదు. ఏదైనా అనుకోని విపత్తు వస్తే కనీసం ఆ హెల్త్ కార్డు లేదు. హెల్త్ కార్డు ఉన్న సరిగా పని చేయక ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులు ఇంకా కనీసం ఆ హెల్త్ కార్డుకు కూడా నోచుకోలేదు. వీరికి హెల్త్ కార్డు ఇచ్చేందుకు ముందుగా పరిషత్ చట్టంలో సవరణ చేయాల్సి ఉంటుందనీ, అందుకోసం పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించటం లేదని ఆ విభాగం ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖను క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తామన్న సీఎం, మంత్రుల ఏండ్ల నాటి హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నది.