Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కిట్లు, ఆహార ప్యాకెట్లలో పెద్ద ఎత్తున లూటీ
- బోర్డు సొమ్మును కార్ల కొనుగోలుకు మళ్లింపు
- వ్యాక్సిన్ల బాధ్యత ప్రయివేటుకు అప్పగించే యత్నం
- పోరాటాల ద్వారా కొంతమేర అవినీతిని అడ్డుకున్నాం
- విచారణ కమిటీ వేయాలని కొట్లాడుతున్నాం
- బిల్డింగ్ మెటీరియల్‌పై జీఎస్టీ ఎత్తేయాలి
నవతెలంగాణతో సీడబ్ల్యూఎఫ్ఐ కర్నాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. మహతోష్
'కర్నాటక కట్టడ, నిర్మాణ కార్మిక మండలి ద్వారా భవన నిర్మాణ కార్మికులకు మెరుగైన రీతిలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అయితే, బీజేపీ గవర్నమెంట్ వచ్చాక అంతే మొత్తంలో అవినీతి కూడా పెరిగిపోతున్నది. భవన నిర్మాణ కిట్లు, ఆహార ప్యాకెట్ల పంపిణీలో పెద్ద ఎత్తున లూటీ జరిగింది. బోర్డు సొమ్మును ఇన్నోవా కార్ల కొనుగోలకు మళ్లింపు జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు వ్యాక్సిన్ల వేయించే ప్రక్రియను కార్పొరేట్ ఆస్పత్రులకు అప్పగించాలని చూస్తే పోరాటాల ద్వారా తిప్పికొట్టాం. కరోనా, జీఎస్టీ, నోట్లరద్దు, తదితరాల వల్ల నేడు భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడుతున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఆ దిశగా మా పోరాటాలు కొనసాగిస్తాం. కార్మికుల సంక్షేమ పథకాల అమలు విషయంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీ వేయాలని కొట్లాడుతున్నాం' అని కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(సీడబ్ల్యూఎఫ్ఐ) కర్నాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.మహతోష్ చెప్పారు. నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
కర్నాటకలో భవన నిర్మాణ కార్మికులకు అందుతున్న సంక్షేమ పథకాలేవి?
కర్నాటక కట్టడ, నిర్మాణ కార్మిక మండలిలో 24 లక్షల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. అందులో సెస్ ద్వారా వసూలైన డబ్బులు రూ.10,600 కోట్లున్నాయి. 19 రకాల సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. ఏటా స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.5,000, పీయూసీకి రూ. 15,000, డిగ్రీకి రూ. 20,000, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర ఉన్నత చదువులకు రూ. రూ.55 వేల స్కాలర్‌షిప్పులను బోర్డు ద్వారా ఇస్తున్నారు. దేశంలోనే బోర్డు ద్వారా అత్యధిక స్కాలర్షిప్పులు ఇస్తున్నది కర్నాటకలోనే. గతంలో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ రూ.2 వేలుండగా దాన్ని రూ.3 వేలకు పెంచడం జరిగింది. బిడ్డల పెండ్లీలకు రూ.60 వేలు ఇస్తున్నారు. సహజంగా కార్మికుడు మరణిస్తే రూ.54 వేలు, కోవిడ్ బారిన పడి భవన నిర్మాణ కార్మికులు చనిపోతే బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు, పని ప్రదేశాల్లో ప్రమాదాల్లో చనిపోతే రూ.5 లక్షలు ఇస్తున్నారు. ఒకవేళ పెన్షన్ పొందే కార్మికుడు చనిపోతే అతని భార్యకు రూ.2 వేలు ఇస్తున్నారు. మెడికల్ బెనిఫిట్ రూ.2 లక్షల దాకా అందుతున్నది. కెఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు 12,600 విలువైన ఫ్రీ బస్‌పాస్‌ను మండలి ద్వారా ఇస్తున్నారు. ఇవన్నీ గతం నుంచే అమలవుతున్నాయి.
భవన నిర్మాణ కార్మికులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతున్నది?
భవన నిర్మాణ కార్మికులకు కరోనా వ్యాక్సిన్ డోస్ వేయించే ప్రక్రియను ప్రయివేటు ఆస్పత్రులకు అప్పగించే కుట్రకు బీజేపీ రాష్ట్ర సర్కారు పూనుకున్నది. ఒక్కో డోసుకు రూ.780గా నిర్ధారించింది. రెండు డోసులకు గానూ రూ.1600 కోట్లను బోర్డు నుంచి ఇవ్వాలని చూసింది. వ్యాక్సినేషన్ కొనుగోలుపై సీఎస్‌కు ఫిర్యాదు చేశాం. పోరాటాల ద్వారా గట్టిగా వ్యతిరేకించాం. దీంతో ప్రయివేటు ద్వారా వ్యాక్సినేషన్ వేయించే అంశం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ సమస్యను ఎత్తిచూపడంలో మీడియా పాత్ర మాకు చాలా చక్కగా ఉపయోగపడింది.
కరోనా సమయంలో వెల్ఫేర్‌బోర్డు ద్వారా కార్మికులకు అందిన సహాయాలేమిటి?
కోవిడ్ సమయంలో ప్రతిరోజూ బెంగుళూరులో లక్ష ఫుడ్ ప్యాకెట్లను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పంపిణీ చేసింది. లక్షలాది మంది అసంఘటిత, వలస కార్మికులు దీని వల్ల లబ్ది పొందారు. 5,40,000 వలస కార్మికులను రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు పంపడంలో బోర్డు పాత్ర కీలకమైనది. కోవిడ్ రిలీఫ్ కింద రూ.5 వేలను భవన నిర్మాణ కార్మికులకు అందజేసింది. అయితే, అందరికీ న్యాయం జరుగలేదు. 1లక్షా80 వేల కోవిడ్ రిలీఫ్ ఫండ్ పొందలేకపోయారు. అయితే, ఆహార ప్యాకెట్లు, రేషన్ కిట్లు, టూల్ కిట్ల అందజేతలో అవినీతి జరిగింది. సెకండ్ లాక్డౌన్లో భవన నిర్మాణ కార్మికులకు సహాయం కింద రూ. 3 వేలను ప్రకటించారు.అయితే, పూర్తిగా న్యాయం జరుగలేదు.
ఆహార ప్యాకెట్లు, టూల్ కిట్లు, రేషన్ కిట్ల పంపిణీలో అవినీతి జరిగిదంటున్నారు? అదెలా?
కోవిడ్ సమయంలో భవన నిర్మాణ కార్మికులకు 21 లక్షల రేషన్ కిట్లను వెల్ఫేర్ బోర్డు పంచింది. మార్కెట్ వ్యాల్యూ ప్రకారం 10 రకాల సరుకుల కిట్టు రూ.400 నుంచి రూ.500 ఉంటుంది. ఈ ఒక్కో కిట్‌కు రూ.938 గా చూపెట్టారు. దీంట్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిం ది. దీనిలో కార్మిక శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వెల్ఫేర్ బోర్డు నేతల పాత్ర ఉంది. వర్కర్లకు టూల్, సేప్టీ, బూస్టర్ కిట్ల పంపిణీలో అవినీతి జరిగింది. ఈ సొమ్మును పక్కదోవ పట్టించి ఉన్నతాధికారులు ఇన్నోవా కార్లను కొనుగోలు చేశారు.క్యాలెండర్పైమోడీ ఫొటో పెట్టి రూ.70 లక్షలు ఖర్చుపెట్టారు.రేషన్ కిట్లలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల అవినీతిని ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన కన్స్ట్రక్షన్ వర్కర్స్ కో ఆర్డినేషన్ కమిటీ (సీఐటీయూ లీడ్‌రోల్ పోషించింది) ద్వారా ఎత్తిచూపాం. జూలై 10న పదివేల మంది కార్మికులు తమ ఇండ్ల ఎదుటే ఉండి ప్లకార్డుల ద్వారా నిరసన తెలిపారు. సరుకుల కిట్లకు బదులు కార్మికునికే నేరుగా డబ్బులు ఇవ్వాలని మంత్రి వద్ద డిమాండ్ పెట్టాం. దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. దీనిపై పోరాటాలు చేశాం. ప్రతి సరుకులోనూ నాణ్యత కొరవడిందని మీడియా ద్వారా ఎత్తిచూపాం. వెంటనే రాష్ట్ర సర్కారు సరిదిద్దుకున్నది. అవినీతిపై విచారణ కమిటీ వేయాలని పోరాడుతున్నాం. బోర్డు ఖర్చుపెట్టే దాంట్లో 40 శాతం నుంచి 50 శాతం వరకు అవినీతి ఉంది. లోకాయుక్త, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని పోస్టు కార్డు ఉద్యమం చేపట్టాం. సీఎం, కార్మిక శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు, లీగల్ సర్వీస్ అథారిటీకి 10 వేల ఉత్తరాలు రాశాం.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఇటీవల చేసిన ముఖ్యమైన పోరాటాలేవి?
ప్రతి నెలా కోవిడ్ సహాయం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నాం. భవన నిర్మాణ కార్మికుల సొమ్ములో రూ.400 కోట్లను స్లమ్ బోర్డుకు మళ్లించడం జరిగింది. దీనిని వ్యతిరేకించడంతో సర్కారు వెనక్కి తగ్గింది. కేఎస్ఆర్టీసీకి కూడా మరలించే యత్నం జరగ్గా అడ్డుకున్నాం. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఇటీవల 12 వేల మంది కార్మికులు బెంగుళూరుకు వచ్చారు. సిటీ రైల్వే స్టేషన్ నుంచి ఫ్రీడమ్ పార్క్ వరకు ర్యాలీ, పబ్లిక్ మీటింగ్ నిర్వహించాం. నాలుగు గంటలపాటు నిరంతరాయంగా వర్షం కురిసినా ఒక్క కార్మికుడు కూడా పోలేదు. ఆ వర్షంలోనే సభను నిర్వహించాం. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. అడిషనల్ లేబర్ చీఫ్ సెక్రటరీ అక్టోబర్ 4న, 11 అక్టోబర్, 15 అక్టోబర్‌లో మూడుసార్లు సమావేశాలు జరిగాయి. ఇండ్లు, మెడికల్, పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ పెట్టాం. బీజేపీ ప్రభుత్వం విధానాలను ఎత్తిచూపుతూ ముందుకు సాగుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు సీడబ్ల్యూఎఫ్ఐ, సీఐటీయూ వైపు ఉన్నారు.
భవన నిర్మాణ కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏంచేస్తే బాగుంటుంది?
సెస్ వసూళ్లను సక్రమంగా చేపట్టాలి. ఆసొమ్మును వెంటనే బోర్డుకు జమచేయాలి. భవన నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుక, ఇనుము, సిమెంట్, కంకర, కలప, తదితరాలపై 18 నుంచి 27 శాతం వరకు జీఏస్టీ వేస్తున్నారు. రెండేండ్ల కింద స్టీల్ టన్ను 42 వేలుంటే నేడు 72-78 వేలకు చేరింది. రూ.250 సిమెంట్ బస్తా నేడు రూ.450 వరకు ఉంది. జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనా వల్ల భవన నిర్మాణ కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. మెటీరియల్ ప్రైస్ పెరగడం భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్లపాలవుతున్నారు. భవన నిర్మాణ రంగానికి అవసరమయ్యే వస్తువులపై జీఎస్టీ ఎత్తేయాలి.