Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ప్రకటనను నాటకంగా రైతులు భావిస్తున్నారు
- కేంద్ర వైఖరిపై కేసీఆర్ నికరంగా మాట్లాడాలి
- రాష్ట్రాల హక్కులను బీజేపీ కాలరాస్తున్నది
- మహిళలను కించపరిచినవారిపై చర్యలు తీసుకోవాలి
- ఎఫ్‌సీఐ గోదాములను ప్రయివేటుకిస్తున్న కేంద్రం : బీవీరాఘవులు
- చట్ట ప్రకారం పోడు పట్టాలివ్వాలి : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏ విషయంలో.. ఎవరికి.. ఎందుకు క్షమాపణ చెప్పారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించారు. రైౖతులకు నష్టం కలిగించే నల్ల చట్టాలను రద్దు చేస్తామన్న మోడీ ప్రకటనను ఒక నాటకంగా రైతులు భావిస్తున్నారనీ, కిసాన్ సంయుక్త మోర్చా కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టు అర్థమవుతున్నదని చెప్పారు. రెండు రోజులుగా జరుగుతున్న తెలంగాణ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు ముగింపు సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటి సభ్యులు చెరుపల్లి సీతారాములు, కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డిలతో కలిసి ఎంబీ భవన్లో బీవీ రాఘవులు విలేకర్లతో ఆదివారం మాట్లాడారు. దేశ రైతాంగాన్ని మోడీ క్షమాపణ కోరడంపై స్పందిస్తూ..ప్రధాని ఎవరికి ఎందుకు క్షమాపణ చెప్పారని ప్రశ్నించారు. మోడీ ప్రకటనలో స్పష్టత లేదనీ, ప్రజల సానుభూతి పొందేందుకు ఒక నాటకంలా ఉందని ఆయన విమర్శించారు. కేంద్ర నిర్ణయం వల్ల 750మంది రైతన్నలు బలయ్యారు. అందుకా క్షమాపణ? నిరసన తెలిపిన రైతులను కష్టపెట్టినందుకా క్షమాపణ? కేంద్ర మంత్రి కాన్వారుతో రైతులను తొక్కించి చంపినందుకా క్షమాపణ? అని రాఘవులు మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు. నల్ల చట్టాలను పార్లమెంట్లో ఉపసంహరించుకునేంత వరకు, ఎంఎస్పీ చట్టం చేసే వరకు ఉద్యమం చేస్తామన్న కిసాన్ సంయుక్త మోర్చాకు అభినందనలు తెలిపారు.
కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 26న నిరసన కార్యక్రమాలతో పాటు విజయోత్సవాలు నిర్వహించాలని రైతాంగాన్ని కోరారు. దీనికి సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సంఘీభావం తెలుపుతున్న దనీ, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఖేరి రైతుల మరణాలకు కారణమైన కేంద్ర మంత్రి తనయుడ్ని శిక్షించి, మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తేనే మోడీ చెప్పిన క్షమాపణకు అర్థముంటుందని రాఘవులు తెలిపారు.
రైతు ఉద్యమానికి మద్ధతు ప్రకటిస్తూ విద్యుత్ చట్టాలను వాపస్ తీసుకోవాలన్న కేసీఆర్ ప్రకటన హర్షణీయమని ఆయన చెప్పారు. అప్పుడప్పుడు ప్రజాఉద్యమాలకు మద్దతు ప్రకటించి ఆ తర్వాత నిశబ్దం వహిస్తారని కేసీఆర్‌పై అపవాదు ఉందనీ, ఇప్పుడు కేంద్రంపై నికరంగా మాట్లాడి ఆ మచ్చను తొలగించుకోవాలని సూచించారు. హుజూరాబాద్ ఫలితం కారణంగానే కేసీఆర్ ఆ విధంగా స్పంధించారని ప్రజలు భావిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రాల హక్కులను బీజేపీ కాలరాస్తున్నదని ఆరోపించారు. నిలకడ లేదన్న అపవాదు తొలగిపోయేలా కేసీఆర్ వ్యవహరించకపోతే టీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని రాఘవులు చెప్పారు.
ఒకే ఒక రోజు జరిగిన ఏపీ అసెంబ్లీ రసాబసాగా మారిందని రాఘవులు అన్నారు. మహిళలను అవమానించటం పాలకపార్టీలకు అలవాటుగా మారిందని చెప్పారు. ఏపీలో పాలక, ప్రతిపక్ష పార్టీలు మహిళలను కించపర్చారని వారి మాటలవల్ల స్పష్టమవుతుందని తెలిపారు. సభలో లేనివారిని ప్రస్తావించి అవమానించటాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కంటతడిపై స్పందిస్తూ.. ఆడవారిని అవమానపరిస్తే ఎవరైనా ఆ విధంగానే బాధపడతారని అన్నారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనకు స్పీకర్ బాధ్యత వహిస్తూ మహిళలను దూషించిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపేక్షిస్తే..స్పీకర్‌ను కూడా తప్పు పట్టాల్సి వస్తున్నదని అన్నారు.
మానిటైజేషన్ పేరుతో ఎఫ్‌సీఐ గోదాములను కేంద్రం ప్రయివేటుపరం చేస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 2.10కోట్ల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 50 ఏండ్లు ప్రయివేటు సంస్థలకు లీజుకిచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నదని, ఈ విషయాన్ని ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. గోదాములను రక్షించుకుంటేనే ధాన్యం సేకరణ సజావుగా సాగుతుందని ఆయన చెప్పారు.
ట్రాన్స్మిషన్ లైన్లు, టెలికం టవర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను కేంద్రం ప్రయివేటైజేషన్‌కు నిర్ణయించిందని దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని రాఘవులు డిమాండ్ చేశారు.
మైనార్టీలపై దాడులకు నిరసనగా 1న హైదరాబాద్‌లో ప్రదర్శన : తమ్మినేని
చట్ట ప్రకారం పోడు సాగు దారులకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు రైతుల నుంచి దరఖాస్తులను మూడు నెలలు పాటు తీసుకోవాల్సి ఉన్నా..జిల్లా కలెక్టర్లు దరఖాస్తులు లేవని చెబుతున్నారని ఇది సరికాదని ఆయన అన్నారు. దీర్ఘకాలంగా దరఖాస్తులు తీసుకునేలా ప్రబుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. యాసంగి ధాన్యాన్ని కూడా కేంద్రం కొనుగోలు చేయాలని ఆ దిశగా కేంద్రంపై వత్తిడి పెంచేలా అఖిలపక్షంతో కలిసి సీఎం కేసీఆర్ ఢిల్లీలో దర్నా చేయాలని సూచించారు. నల్ల చట్టాలపై రైతులు అలుపెరగని పోరాటం చేయటంతో కేంద్రం తోకముడిచిందని, సరైన మార్గంలో వత్తిడి చేస్తే ధాన్యం సేకరణ విషయంలో కూడా ఫలితం సాధించవచ్చని తమ్మినేని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో తెరవాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని ఈ విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. మైనార్టీలపై దాడులకు నిరసనగా డిసెంబర్ 1న హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన చేయనున్నట్టు తెలిపారు. కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు ఈ నెల 26న అన్ని గ్రామాల్లో విజయోత్సవాలు జరపాలని పార్టీ శ్రేణులకు తమ్మినేని పిలుపునిచ్చారు.