Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈఎస్ఐ కుంభకోణంలో దూకుడు పెంచిన ఈడీ..
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాంలో నిందితులకు చెందిన రూ.144.4 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జప్తు చేశారు. ఇందులో ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ దేవికారాణికి చెందిన ఆస్తులే ఎక్కువగా ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు. దాదాపు రెండేండ్ల క్రిందట ఈఎస్ఐలో కోట్లాది రూపాయల మందుల కొనుగోల్‌మాల్ జరిగిన కేసును ఏసీబీ అధికారులు నమోదుచేసి ఎనిమిది ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఈ కేసును ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈడీ దర్యాప్తులో భాగంగా ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మీలతో పాటు పలువురు ఇతర ఉద్యోగులు, ఫార్మాసిస్ట్లు, డ్రగ్ డీలర్లు, మెడికల్ ఏజెన్సీల యజమానులను కూడా ఈడీ అరెస్టు చేసింది. కాగా తాజాగా వీరికి చెందిన రూ. 144.4 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు జప్తుచేశారు. ఇందులో ఎనిమిది విల్లాలు, కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ క్షేత్రాలు, దాదాపు ఆరుకోట్ల రూపాయలకు పైగా దేవికారాణికి చెందిన నగలు ఉన్నాయి. అంతేగాక హైదురాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాలలోని విలువైన గృహసముదాయాలు కూడా ఈడీజప్తు చేసిన ఆస్తులలో ఉన్నాయి. ఈఎస్ఐ.. ఐఎంఎస్ విభాగం ద్వారా వివిధ ఫార్మా కంపెనీల నుంచి అవసరమైన కోట్లాది రూపాయల మందుల కొనుగోళ్లలో డైరెక్టర్ దేవికారాణి, ఇతర అధికారులు కోట్ల రూపాయలను నొక్కేశారని గతంలో దర్యాప్తులో తేలింది. మందులు కొన్నట్టు కాగితాల్లో చూపుతు ఆసలు మందులనే కొనలేదని తేలింది. పలు మెడికల్ క్యాంపులను నిర్వహించినట్టు రికార్డులలో చూపించి అందుకు కోట్ల రూపాయల మందులను ఖరీదు చేసినట్టుగా దేవికారాణి, ప్రయివేటు మందుల కంపెనీల యజమానులతో కుమ్మక్కై స్కామ్‌కు పాల్పడినట్టుగా కూడా ఈడీ తేల్చింది.