Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రతిపక్షాలకు ఒక న్యాయం, అధికార పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీకి ఒక న్యాయమా?అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. వడ్లు కొనుగోలు చేయాలని సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. బీజేపీ, టీఆర్ఎస్ ధర్నా చేస్తే అవకాశం కల్పించిన పోలీసు యంత్రాంగం ప్రతిపక్షాలు ధర్నా చేస్తే అడ్డుకోవడం సరైంది కాదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్‌ను కలిసేందుకు కనీసం ఐదుగురితో ప్రతినిధి బృందానికి అవకాశమిస్తే బాగుండేదని సూచించారు. ప్రతిపక్షాల గొంతుక అంటే ప్రజల గొంతు అని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రాతినిధ్యం లేదనీ, ముఖ్యమంత్రి సమయం ఇవ్వబోరని విమర్శించారు. గవర్నర్ సైతం ఉస్మానియా విశ్వవిద్యాలయంపై ప్రాతినిధ్యం చేసేందుకు సమయం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తే అనుమతిలేదని వివరించారు. వడ్ల కొనుగోలుపై గవర్నర్ దృష్టిపెట్టి రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో పండిన వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి కొనుగోలు కేంద్రాలను పెంచి వడ్ల కొనుగోలును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.