Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనస్థలిపురంలోని ఓ ఆలయ చిరుద్యోగి..
- కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన ఆలయ చైర్మెన్
- ఉద్యోగి భార్య దళితురాలు కావడంతో ఆలయ బహిష్కరణ
- బాధితులను పరామర్శించి అండగా నిలిచిన కేవీపీఎస్
- ఆలయ చైర్మెన్ కొలిశెట్టి లక్ష్మయ్యను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ డిమాండ్
నవతెలంగాణ-హస్తినాపురం
విశ్వనగరంగా పేర్కొనే హైదరాబాద్‌లో ఆధునిక కాలంలోనూ కుల మహమ్మారి పొంచి ఉందన్న సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. వనస్థలిపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వరాలయంలో పనిచేస్తున్న చిరుద్యోగి యాదగిరిగౌడ్ కులాంతర వివాహం చేసుకున్నందుకు, చేసుకున్న మహిళ దళితురాలైనందుకు ఆలయంలో దంపతులను ఆలయ చైర్మెన్ కొలిశెట్టి లక్ష్మయ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా వేధించడమేగాక ఆలయ బహిష్కరణ చేయించాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. మంగళవారం వనస్థలిపురం ఏసీపీ కార్యాలయం వద్ద బాధితులను కలిపిన కేవీపీఎస్ బృందం వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా బాధితురాలు ప్రేమలత మాట్లాడుతూ.. తన భర్త కులాంతర వివాహం చేసుకున్నాడని తెలిసినప్పటి నుంచి ఆలయ చైర్మెన్ కొలిశెట్టి లక్ష్మయ్య అతన్ని ఏదో ఒక విధంగా వేదిస్తూ వస్తున్నాడని తెలిపారు. తమకి డబుల్బెడ్రూమ్ ఇల్లు మంజూరైనప్పటికీ తమ అడ్రస్ చెప్పకుండా రాకుండా చేశారని ఆరోపించారు. తన భర్తను ఉద్యోగం నుంచి తొలగించారనీ, అలా ఎందుకు చేశారని అడగడానికి వెళ్తే మాటల్లో చెప్పడానికి వీల్లేని విధంగా బూతులు తిట్టాడని కన్నీటి పర్యంతమైంది. ఆలయం ఎదురుగా కొబ్బరికాయల దుకాణం పెట్టుకోగా దానికి పోటీగా వేరే వ్యక్తిని తెచ్చి పెట్టి తమ నోటికాడి బుక్క లాగేశాడని తెలిపారు. అంతేగాక ఆలయ చైర్మెన్ తాము ఉంటున్న ఇంటి తాళం పగులగొట్టి వస్తువులను బయట పడేయడంతో తమ పిల్లల బుక్స్, సర్టిఫికెట్స్ నీళ్లలో తడిచిపోయాయన్నారు. అనంతరం వనస్థలిపురం ఏసీపీని కలవడానికి వెళ్లగా.. వారు ఆఫీసులో లేకపోవడంతో కేవీపీఎస్ సహకారంతో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. అనంతం కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు మీడియాతో మాట్లాడారు.
కులాంతర వివాహం చేసుకున్న ఆలయ చిరుద్యోగిపై ఆలయ చైర్మెన్ కొలిశెట్టి లక్ష్మయ్య వివక్ష చూపడమేగాక, ఉద్యోగి భార్య ప్రేమలతను కులంపేరుతో దూషించడం అత్యంత దారుణమైన విషయమన్నారు. పైగా తన భర్తను ఉద్యోగంలోంచి ఎందుకు తీసివేశారని అడగడానికి వెళ్లిన ఆమెను ఆలయ చైర్మెన్ కాలితో తన్నడం సిగ్గుచేటన్నారు. చైర్మెన్‌పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత దంపతులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. వారికి కేవీపీఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కులాంతర వివాహం చేసుకోవడం నేరం కాదనీ, ఆ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించి ఒక కుటుంబాన్ని రోడ్డుపాలు చేసే హక్కు ఆలయ చైర్మెన్‌కు లేదని స్పష్టం చేశారు. అయితే దళితురాలైన ప్రేమలత చదువుకోలేదనీ, సర్టిఫికెట్ లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. అవసరమయితే ఆమె స్వగ్రామంలో పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాని ఎస్సీ సర్టిఫికెట్ కోసం పోలీసులు ఒత్తిడి చేయవయడం సరికాదన్నారు. బాధితులను పరామర్శించిన వారిలో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భీమనపల్లి కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బాలు, సీఐటీయూ నాయకులు కీసరి నర్సిరెడ్డి, ఆలేటి ఎల్లయ్య, స్థానిక నాయకులున్నారు.