Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీలు రాకపోవడంతో కొనుగోళ్లలో జాప్యం
- తాలు తరుగు పేరిట బస్తాకు 2 కిలోలు కట్
- మెదక్, కరీంనగర్లో ఆందోళన
- రైతులకు న్యాయం చేస్తానని మెదక్ డీఎస్పీ హామీ
- పలు జిల్లాలో భారీ వర్షానికి ముద్దయిన పంట
నవతెలంగాణ-హవేలీఘనపూర్/ చిన్నకోడూరు/చొప్పదండి/ హాజీపూర్ /చందుర్తి
ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. లారీల కొరత.. వెరసి అన్నదాత కుదేలవుతున్నాడు. నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా పంట కాంటాలు కావడం లేదు. దానికితోడు తాలు, తరుగు పేరుతో భారీగా కోత పెడుతున్నారు. దీన్నినిరసిస్తూ రైతులు మంగళవారం కూడా రోడ్లపై బైటాయిం చారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసి ధాన్యం తడిసి ముద్దయింది. తాలు తరుగు పేరిట బస్తకు రెండు కిలోలు అదనంగా తూకం వేయడాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలంలోని శమ్నపూర్ రైతులు రోడ్డెక్కారు. సుమారు గంటపాటు మెదక్- రామాయంపేట రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. లారీలు సకాలంలో రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం కూడా సెంటర్లలోనే పేరుకుపోతున్నదన్నారు. తద్వారా కొనుగోళ్లలో జాప్యం జరుగుతున్నదన్నారు. దీనికి తోడు బస్తాకు రెండు కిలోల ధాన్యాన్ని తాలు పేరుతో అధికంగా తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 600 గ్రాముల ధాన్యాన్ని మాత్రమే తాలు, తరుగు పేరుతో తీసేవారని.. ఇప్పుడు రెం డు కిలోలు తీయడం ఏంటని ప్రశ్నించారు. మెదక్ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు. ఈ నిరసనలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మలి శెట్టి రవి, సిద్ధిరాములు, రవీందర్ తదితరులు ఉన్నారు.
రుక్మాపూర్‌లో రోడ్డుపై బైటాయింపు
రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై బైటాయించారు. రైతులకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఎస్ఐ బి.వంశీకృష్ణ్ణ ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమిం పచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుక లింగయ్య, మాజీ ఎంపీటీసీ ముద్దసాని రంగన్న పాల్గొన్నారు.
కల్లాల్లో తడిచిన ధాన్యం
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా రైతులు వరి పొలాలు కోస్తూ ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసేందుకు స్థలం, దానిపై కప్పేం దుకు టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో పరదాలు అద్దెకు తీసుకొచ్చి వాటిపై ధాన్యం ఆరబోస్తున్నా రు. వారం రోజులుగా జిల్లాలో ఏదో ఓ చోట వర్షం కురు స్తూనే ఉంది. ఇంకా కోత కోయని పొలాల్లో వర్షంతో కోతకు సహకరించక ట్రాక్ మిషన్లతో కోయడంతో రైతుకు ఆర్థిక భారం పడుతోంది. వర్షాలకు వరి పైరు నేల వాలడంతో సుడిదోమ ఆశించి పంటకు తీరని నష్టం వాటిల్లింది. మంగ ళవారం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో కల్లాల్లోనే ధాన్యం నీటమునిగింది. నంనూర్, ముల్కల్లా, వేంపల్లి, గుడిపేట్, నర్సింగపూర్, రాపల్లి, కర్ణమామిడి, పెద్దంపేట్, గొల్లపల్లి, దోనబండలో వర్షం కురిసింది. కల్లాల్లోని ధాన్యం కొనుగోళ్లకు నోచుకోకపోవడంతో వర్షానికి తడిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీటిలో మునిగింది. తడిసిన ధాన్యం మొలకలు వచ్చే అవకాశం ఉందని, మరో వారం రోజుల్లో ఆరబెడితే కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్లలో భారీ వర్షం
భారీ వర్షంతో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ధాన్యం తడిసిముద్దయింది. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్, ఆనంతపల్లి, మర్రిగడ్డ, చందుర్తిలో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది.