Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రను తిరగరాసిన రైతుఉద్యమం
- పోరాడే శక్తులకు ఎర్రజెండానే అండ : సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా మహాసభలో తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రధాని మోడీ అసమర్ధుడని, కరోనా నియంత్రణలో ఘోరంగా విఫలమయ్యాడని, దీంతో దేశంలో 4 నుంచి 5 లక్షల మంది మృతిచెందారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా ప్రథమ మహాసభలు మంగళవారం హన్మకొండలోని రౌతు మనోహర్నగర్ (ఏబీకే మాల్)లో జరిగాయి. మహాసభలకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులు టి. ఉప్పలయ్య, జిల్లా కమిటీ సభ్యులు రాగుల రమేష్, వేలు రజిత అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. తొలుత అరుణ పతాకాన్ని సీనియర్ నాయకులు పి. చంద్రారెడ్డి ఆవిష్కరించగా, అనంతరం రౌతు మనోహర్ చిత్రపటానికి తమ్మినేని వీరభద్రం పూలమాల వేసి నివాళులర్పించారు. మహాసభలను తమ్మినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగ ఉద్యమం చరిత్రను తిరగరాసిందని అన్నారు. పోరాడే శక్తులకు ఎర్రజెండానే అండగా వుంటుందని, అందులో సీపీఐ(ఎం) కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశ రక్షణ, లౌకిక స్వభావం, రాజ్యాంగాన్ని రక్షించేది కమ్యూనిస్టులేనన్నారు. మోడీపై ప్రజలుకున్న భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. 14 నెలలుగా రైతాంగ పోరాటం చేసిన క్రమంలో 700 మంది రైతులు మృతి చెందారని, వారికి సంబంధించి కనీసం ఎక్స్‌గ్రేషియా సైతం మోడీ ప్రకటించలేదన్నారు. ఈ రైతాంగ పోరాటం కొనసాగాలన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలున్నందునే, ఈ రాష్ట్రాల్లో రైతాంగ పోరాటం బలంగా వుండడం వల్లే మోడీ ఈ చట్టాలను ఉపసంహరించుకున్నాడన్నారు. మోడీ కనీస మద్దతు ధరల విషయంలో కమిటీని వేయనున్నట్టు చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇప్పటికే స్వామినాథన్ కమిటీ సిఫారసులు చేసిందని, ఆ సిఫారసుల మేరకు చట్టం చేస్తే సరిపోతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మార్క్సిజం, లెనినిజం పట్ల సాధారణ ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు. 20 ఏండ్లుగా ప్రపంచంలో కమ్యూనిజాన్ని అడ్డుకుంటున్న శక్తులు పతనమవుతున్న స్థితి కనపడుతున్నదన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు అమెరికానే అత్యంత సంపద గల దేశమని, రానున్న రెండు, మూడేండ్లలో చైనా తన జీడీపీ శాతాన్ని వేగంగా పెంచుకుంటూ నెంబర్‌వన్ దేశంగా ఆవిర్భవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. చైనాలో 1921లో కమ్యూనిస్టు పార్టీ పుట్టిందని, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ నేడు అంతరిక్షంలో తన సొంతంగా ప్రయోగశాలను నిర్మించిందన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం అమెరికా కూడా ఏవిధంగానూ చైనాను నియంత్రించే శక్తి లేదన్నారు.
భౌతిక శక్తిగా మారాలి..
ఒక భావం ప్రజలకు ఆవరిస్తే అది ఒక భౌతిక శక్తిగా ఆవిర్భవిస్తుందని కారల్ మార్క్స్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ మీరంతా భౌతిక శక్తిగా మారాలని తమ్మినేని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పగలు విమర్శించి, రాత్రి ఢిల్లీకి వెళ్లి కల్సి రావడం ఆనవాయితీగా మారిందన్నారు. రాష్ట్రంలో బీజేపీనే ప్రధాన శత్రువన్నారు. బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్‌కు సైద్ధాంతిక స్పష్టత లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో కేవలం 30 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందన్నారు. రాష్ట్రంలో పోడు భూముల చట్టం రావడానికి కమ్యూనిస్టుల పోరాటాలే కారణమన్నారు. నైజాం వ్యతిరేక పోరాటం చేసిన చారిత్రాత్మక నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కు ఉందన్నారు. అంతకుముందు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఎం. చుక్కయ్య సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సారం పల్లి వాసుదేవరెడ్డి కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.
ఈ మహాసభలలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పోతినేని సుదర్శన్, ఎం. సాయిబాబు, సీనియర్ నాయకులు కె. వెంకటయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. ప్రభాకర్‌రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్. రంగయ్యయ తదితరులు పాల్గొన్నారు.