Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిలో వంద దాటిన వైనం
- పెరిగిన రవాణాచార్జీలకుతోడు వర్షాల ప్రభావం
- ఏపీ, కర్ణాటక నుంచి రాని పరిస్థితి
- యూపీ, గుజరాత్, మహారాష్ట్రలో రూ 140పైనే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టమాట ధర దడపుట్టిస్తున్నది. పెట్రోల్ ధరతో పోటీ పడుతూ సెంచరీ మార్క్‌ను దాటేసింది. ఇతర రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తున్నది. యూపీ, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కిలో రూ.140 దాటి పైపైకి ఎగబాకుతున్నది. పెరిగిన రవాణాచార్జీల భారం, భారీ వర్షాలతో దిగుబడి దెబ్బతినడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. టమాట కోసం మార్కెట్‌కు వెళుతున్న వినియోగదారులు...వామ్మో ఇంత ధరనా? అంటూ తిరిగి వెళ్లిపోతున్నారు. టమాట ధర ఇంత పెరగడం ఎప్పుడూ చూడలేదనీ, వాటికంటే చికెన్ తెచ్చుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. దాని ధర పెరగడంతో దానికి బదులుగా కూరల్లో చింతపండు వాడుతున్నట్టు రాంనగర్‌కు చెందిన సట్ట ఇందిరా నవతెలంగాణకు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి టమాట ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుండే దిగుమతి అవుతున్నది. మన రాష్ట్రానికి చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి ఎక్కువగా వస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో భారీ వానలు కురవడంతో టమాట పంట పూర్తిగా దెబ్బతిన్నది. పంట నీటిలో ముగినిపోవడం, కాత, పూత రాలిపోవడంతో ఈ పరిస్థితి తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి లోకల్ టమాట మాత్రమే మార్కెట్‌కు వస్తున్నది. బయటి రాష్ట్రాల నుంచి వినియోగానికి సరిపడినంత రాకపోవడంతో స్థానికంగా ధర క్రమక్రమంగా పెరుగుతున్నది. పెట్రోల్ ధరతో సమానంగా ఇంకా చెప్పాలంటే పైపైకి ఎగబాకి వినియోగదారుల్లో గుబులు పుట్టిస్తున్నది. ప్రతి రోజు కూరల్లో ఉపయోగించే టమాటకు కాస్తా డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. దీని ధర సాధారణంగా చలికాలంలో కేజీ రూ 20లకు మించి ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో కొరత ఏర్పడటంతో దాని ధర ఆకాశాన్నంటుతున్నది. దీనితోడు పెట్రోలు ధరలు పెరగడంతో రవాణా వ్యయం పెరిగింది. హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు ప్రతి రోజు మూడువేల నుంచి నాలుగువేల క్వింటాళ్ల వరకు టమాటాలు వస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 700 క్వింటాళ్లు మాత్రమే వస్తుండటం గమనార్హం. ఎన్టీఆర్ మార్కెట్‌కు సాధారణ పరిస్థితుల్లో 1500 క్వింటాళ్ల నుంచి 1600 క్వింటాళ్ల టమాట వస్తుంది.కానీ మంగళవారం కేవలం 600 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని అధికారులు తెలిపారు.దీంతో హౌల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ 70 నుంచి 80 పలుకుతున్న టమాట...రిటైల్ మార్కెట్లో రూ 100 నుంచి రూ 120 ధర పలుకుతున్నది.దీంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
ఇతర రాష్ట్రాలోనూ అదే పరిస్థితి
తెలంగాణతోపాటు యూపీ, పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లోనూ టమాట ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో దాని ధర కేజీ రూ 140 పలుకుతున్నట్టు తెలిసింది.
కూరగాయలకు రెక్కలు
రాష్ట్రంలో టమాటతో పాటు ఇతర కూరగాయాల ధరలకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలో 1.20 లక్షల ఎకరాల్లో అవి సాగవుతూ ఉన్నాయి. ఈసారి యాసంగిలో ఇంకా వాటి సాగు ప్రారంభంకాలేదు. దీంతో టమాటతోపాటు కూరగాయలు సైతం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.మరోవైపు ఆంధ్రప్రదేశ్ 58 వేల ఎకరాల్లో టమాట సాగు అవుతున్నది. 26.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి అవుతున్నది. కానీ పంట మొత్తం నీటిపాలైంది. మహారాష్ట్రలోని సాలాపూర్, కర్ణాటకలోని చిక్బుల్లాపూర్, ఏపీలోని మదనపల్లి ప్రాంతాలు టమాట పంటకు ప్రసిద్ధి.
కానీ ఇటీవల కురిసిన భారీ వానలు రావడంతో టమాట పంటను దెబ్బతీశాయి.
ఉల్లి ధరలు సైతం క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉన్నది. దాని ధర కేజీ రూ 40 నుంచి రూ 50కి చేరుకున్నది. కాప్సికం, ఆలుగడ్డ, బెండ, పచ్చిమిర్చి ధరలు రెట్టింపు అవుతున్నాయి.