Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మెడికల్ పీజీ సీట్లలో ఇన్ సర్వీస్ కోటాకు వ్యతిరేకంగా తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టి-జుడా) చేపట్టిన నిరసన మూడో రోజుకు చేరింది. బుధవారం రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో జూడాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో నిర్వహించిన నిరసనలో జూనియర్ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే వెయిటేజ్ పొందుతున్న ప్రభుత్వ డాక్టర్లకు ఇన్ సర్వీస్ కోటా ఇస్తే నిరుద్యోగ వైద్యవిద్యార్థులమైన తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్‌తో ఇప్పటికే ఉన్న సీట్లలో 50 శాతం అఖిల భారత కోటాకు వెళతాయనీ, మిగిలిన వాటిలో రిజర్వేషన్ ఇస్తే నిరుద్యోగులు నష్టపోతారని తెలిపారు. సర్వీస్ కోటా నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే శుక్రవారం నుంచి విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జుడా నాయకులు డాక్టర్ రాజీవ్, డాక్టర్ మణికరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.