Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రభుత్వ గణాంక కార్యాలయం (పీఏఓ-పబ్లిక్ అకౌంట్ ఆఫీస్) శాఖ సూపరింటెండెంట్‌కు చెందిన రూ. 2.89 కోట్లకు పైగా విలువైన ఆస్తులను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జప్తు చేసింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో అబిడ్స్‌లోని పీఏఓ లో సూపరింటెండెంట్‌గా పని చేసిన వెంకటేశ్వర్రావుపై కోట్ల రూపాయల్లో అక్రమాస్తులను సంపాదించాడని ఏసీబీ అధికారులు కేసులను నమోదు చేశారు. దీనిపై దర్యాప్తును పూర్తి చేసి హైదరాబాద్ ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో చార్జీషీటును దాఖలు చేశారు. కేసును విచారించిన ఏసీబీ కేసుల స్పెషల్‌కోర్టు న్యాయమూర్తి సాంబశివనాయుడు వెంకటేశ్వర్ రావుకు చెందిన రూ. 2,89,39,600 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. కాగా, ఈ మధ్యలో వెంకటేశ్వర్ రావు మరణించడంతో ఆయన ఆస్తులు భార్య శ్యామలా దేవీ, కుమారులు మాధవ్, శేషగిరి రావుల పేరిట మారాయి. ఈ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు తెలియజేయగా వారి పేరిట ఉన్న ఆస్తులను జప్తు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలను అమలు చేశామని ఏసీబీ డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్ తెలిపారు.