Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎయిడ్స్, హెపటైటీస్ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ సేవలు అవసరమైన వారి కోసం ప్రత్యేకంగా రెండు డయాలసిస్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో ఒకటి హైదరాబాద్లో, మరొకటి వరంగల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఒక్కో కేంద్రంలో ఐదు పడకల చొప్పున కేటాయించాలని ఆయన సూచించారు. వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. రాష్ట్రంలోడయాలసిస్ కేంద్రాల ద్వారా 10 వేల మంది రోగులకు సేవలందించేందుకు ప్రభుత్వం ఏడాదికి రూ.100 కోట్లను ఖర్చు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకూ ఈహెచ్ఎస్ కింద రాష్ట్రంలోని 43 డయాలసిస్ కేంద్రాల్లో ఉచితంగా సేవలందించాలని ఆదేశించారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉన్న కేంద్రాలను గుర్తించి, ఆయా కేంద్రాల్లో ఎన్ని డయాలసిస్ మిషన్లు కొత్తగా అవసరమవుతాయో గుర్తించి ప్రతిపాదనలు తయారు చేయాలని డీఎంఈ రమేష్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. రోగుల సంఖ్య ఆధారంగా, కొత్త డయాలసిస్ కేంద్రాల అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి, కొత్తగా అక్కడ ఎన్ని డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందో కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.