Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు ఉద్యమానికి ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఏఐకేఎస్‌సీసీ పిలుపుమేరకు గురువారం హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఉదయం 10గంటలకు 'రైతు మహాధర్నా' చేపట్టబోతున్నాయి. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామన్న ప్రధాని మోడీ నిర్ణయం తర్వాత జాతీయ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న తొలిధర్నా కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత నెలకొంది. సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే...మిగతా ఆరు డిమాండ్లను పరిష్కరించాలంటూ రైతు ఉద్యమం కొనసాగుతున్నది. ముఖ్యంగా కనీస మద్దతు ధరల చట్టం తేవాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఏఐకేఎస్‌సీసీ దేశ వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నది. రాష్ట్రంలో పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలనీ, వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలనే డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిస్తున్నది. అందులో భాగంగానే వివిధ రైతు సంఘాల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా జరగనుంది. సాగు చట్టాల రద్దు నిర్ణయం ఈ కార్యక్రమానికి కిసాన్ సంయుక్త మోర్చా (ఎస్కేఎస్) జాతీయ నేతలు తికాయత్, హన్నన్‌మొల్లా, అశీష్ మిట్టల్ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. ఈ ధర్నాకు వేలాదిగా తరలి రావాలని ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర నాయకులు టి సాగర్, పశ్మపద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, రాయల చంద్రశేఖర్, వల్లపు ఉపేందర్‌రెడ్డి, జక్కుల వెంకటయ్య తదితరులు ఈసందర్భంగా పిలుపునిచ్చారు.