Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డాక్ర్ ఎస్.గ్లోరీ స్వరూప
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళా పారిశ్రామికవేత్తల పురోగతికి అవసరమైన సహకారం అందిస్తామని నిమ్స్మే డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.గ్లోరీ స్వరూప తెలిపారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్ టీసీసీఐ) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలుగా మహిళలకు మార్గదర్శకత్వం అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమంలో గ్లోరీ మాట్లాడుతూ మహిళా సాధికారత, వారికి సంబంధించిన పారిశ్రామిక విషయాల్లో ఆలోచనల్లో మార్పు వస్తున్నదని తెలిపారు. పారిశ్రామికరంగంలో వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా పారిశ్రామికవేత్తల సంఘాలను ప్రోత్సహించాలని సూచించారు. ఎలికో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వనిత దాట్ల మాట్లాడుతూ, మహిళలు ఉద్యోగాలు పొందే వారుగా కాకుండా ఇచ్చే వారుగా ఎదిగేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఛాంబర్స్ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ భగవతి దేవి బల్డ్వ మాట్లాడుతూ తామెంటో నిరూపించుకునేందుకు పారిశ్రామికవేత్తలుగా మారాలని పిలుపునిచ్చారు. సువేన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ చైర్మెన్ వెంకట్ జాస్తి మాట్లాడుతూ తమ కలలను సాకారం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఛాంబర్స్ అధ్యక్షులు కె.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్కెట్ సంస్కరణలు వ్యాపారానికి అనుకూలంగా ఉంటున్నాయని చెప్పారు. దేశంలో 5.85 కోట్ల మంది వ్యాపారవేత్తలుండగా, అందులో 13.76 శాతం అంటే 80 లక్షల మంది మహిళలున్నారనీ, వారు 20.37 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అధిపతులుగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్లోబల్ ఇన్ఫోవిజన్ ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు సూరపనేని, ఎఫ్టీసీసీఐ సీనియర్ ఉపాధ్యక్షులు అనిల్ అగర్వాల్, ఉపాధ్యక్షులు మీలా జయదేవ్, సీఇఓ ఖ్యాతి నరవనే పాల్గొన్నారు.