Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యసభ స్థానాలపై టీఆర్ఎస్ సీనియర్ల దృష్టి
- తెరపైకి బోయినపల్లి వినోద్‌కుమార్, దామోదరరావు, మోత్కుపల్లి, మండవ తదితరులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రం నుంచి త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలపై అధికార పార్టీకి చెందిన పలువురు సీనియర్లు కన్నేశారు. అయితే ఎవరికీ అంతుచిక్కని రీతిలో రాజకీయంగా అనూహ్య నిర్ణయాలు తీసుకునే సీఎం కేసీఆర్... వారిలో ఎవరికి సీటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ చేత రాజీనామా చేయించిన కేసీఆర్, ఆయన్ను శాసనమండలికి పంపారు. ప్రకాశ్‌కు ఇంకా మూడున్నరేండ్ల పదవీకాలం ఉన్నప్పటికీ అనూహ్యంగా అక్కడి పెద్దల సభ నుంచి ఇక్కడి పెద్దల సభకు ఆయన్ను రప్పించారు. ఈ క్రమంలో ప్రకాశ్ స్థానాన్ని సీఎం ఎవరితో భర్తీ చేయబోతున్నారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. నిన్నటి వరకూ ఆ స్థానాన్ని తన కూతురు కల్వకుంట్ల కవితతో.. కేసీఆర్ భర్తీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆమె ఇప్పుడు స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులు క్రమక్రమంగా మారుతున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఢిల్లీలో చురుగ్గా పనిచేసే నేతలనే రాజ్యసభకు పంపాలని గులాబీ బాస్ నిర్ణయించినట్టు వినికిడి. ఇందుకు సంబంధించి టీఆర్ఎస్ మీడియా వ్యవహారాలను అధికారికంగా పర్యవేక్షిస్తున్న దామోదరరావు పేరు ప్రముఖంగా వినబడుతున్నది.
మరోవైపు రాష్ట్రం నుంచి రాజ్యసభ్యులుగా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ధర్మపురి శ్రీనివాస్ పదవీ కాలం కూడా వచ్చే ఏడాది జూన్‌లో ముగియబోతున్నది. ఈ రెండు స్థానాలకు కూడా విపరీతమైన పోటీ నెలకొన్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్, ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నిజామాబాద్ జిల్లా సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ జిల్లాకే చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్లను ఆయా స్థానాల కోసం సీఎం పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరిలో వినోద్‌కుమార్‌కు గతంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేతగా వ్యవహరించిన అనుభవముంది. అందువల్ల ఆయనకు రాజ్యసభ సీటు గ్యారెంటీ అనే చర్చ కొనసాగుతున్నది. ఇక పొంగులేటి, మోత్కుపల్లి కూడా పెద్దల సభ మెట్లెక్కేందుకు వీలుగా ఇప్పటికే తమ ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఇదే సమయంలో పొంగులేటి... ఎమ్మెల్సీ పదవిని ఆశించి భంగపడ్డారు. ఈ క్రమంలో ఆయన్ను రాజ్యసభకు పంపకపోతే కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని ఆ మాజీ ఎంపీ సన్నిహితులు చెబుతున్నారు. తుమ్మల మాత్రం రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యతిస్తూ... మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చెప్పారనే గుసగుసలు వినబడుతున్నాయి.