Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించండి: జూలకంటి
నవతెలంగాణ - సూర్యాపేట
టీఆర్ఎస్ మంత్రు లు, ఎమ్మెల్యేలతో పాటు నాయకులు చేయాల్సింది ఢిల్లీ పర్యటనలు కాదని.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల బాధలు తెలుసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో విలేకర్ల సమావేశంలో మొలకెత్తిన ధాన్యాన్ని చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు తడిచి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ ధాన్యాన్ని ఎండబెట్టడం, రాశులు పోయడం వల్ల రైతుకు ఎకరాకు రూ.1000 చొప్పున ఖర్చవుతుందన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, విమానాలు, కార్లలో తిరుగుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. రైతుల పట్ల టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర నాయకులు జగదీష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు, ధీరావత్ రవినాయక్ తదితరులు ఉన్నారు.