Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి
- రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
- ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి: సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-ముదిగొండ
వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రధాని మోడీ పార్లమెంట్లో బిల్లు ఆమోదింపచేయాలని అఖిల భారత రైతు సంఘం(ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ముదిగొండలో బుధవారం ఆ సంఘం మండల అధ్యక్షులు కందుల భాస్కరరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో సారంపల్లి పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏడేండ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కడగండ్లు మిగిల్చారన్నారు. విద్యుత్ సవరణ బిల్లుతో పాటు లేబర్ కోడ్లను పార్లమెంట్లో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏడాది పాటు రైతులు చేసిన ఉద్యమం ఫలితంగానే ప్రధాని మోడీ రైతు చట్టాల రద్దుకు ముందుకు వచ్చారన్నారు. రైతు ఉద్యమంలో అశువులు బాసిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కారమయ్యే వరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఉద్యమంలో రైతులపై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలని కోరారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ కపటనాటకాలాడుతూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతుల ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలందరూ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరగనున్న మహాధర్నాలో రైతులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతుసంఘం మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శిగా కందుల భాస్కరరావు, కోలేటి ఉపేందర్తోపాటు మరో 19 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. సదస్సులో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాదినేని రమేష్, మధిర నియోజకవర్గ ఇన్చార్జి వాసిరెడ్డి వరప్రసాద్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, పయ్యావుల పుల్లయ్య, వ్యకాస మండల కార్యదర్శి వేల్పుల భద్రయ్య, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శి మందరపు పద్మ, పయ్యావుల ప్రభావతి పాల్గొన్నారు.