Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేని పక్షంలో ఉద్యమం తప్పదు:
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య
- రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కరాములు
- వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆపాలి
నవతెలంగాణ-మెదక్ డెస్క్
పోడు భూముల సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రైతులకు పట్టాలివ్వాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో నిర్వహించిన సీపీఐ(ఎం) సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశానికి వీరయ్య, చుక్క రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఆచరణలో కుంటి సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తోందన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో కొన్నేండ్లుగా భూములకు పట్టాదారు పాసుబుక్‌లు, రికార్డులున్నా ఫారెస్టు భూములని కొత్త పాస్ బుక్స్ ఇవ్వకుండా రైతులను తీవ్రంగా ఆర్థిక ఇబందులకు, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పాస్‌పుస్తకాలు లేక ప్రభుత్వ పథకాలైన రైతు బంధు, బ్యాంకులు లోన్లు, రైతు బీమా వర్తించడం లేదని తెలిపారు. ఇప్పటికైనా వెంటనే రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతూ రైతులను మోసం చేస్తున్నాయన్నారు. డ్రామాలు ఆపి రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. చుక్క రాములు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బి.మల్లేశం, కార్యదర్శివర్గ సభ్యులు జి.జయరాజు, కె. రాజయ్య, బి.రాంచందర్, మాణిక్యం, జిల్లా కమిటీ సభ్యులు నర్సింహారెడ్డి, పాండురంగా రెడ్డి, జి.సాయిలు, ప్రవీణ్ కుమార్, ఎం.నర్సిములు, యాదవరెడ్డి, ప్రవీణ్ కుమార్, యాదగిరి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.