Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వామినాధన్ కమిటీ నివేదిక అమలు చేయాలి: నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి
- 27న 'రైతన్న' సినిమాను అందరూ చూడండి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఈనెల 27న విడదలయ్యే రైతన్న సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవనంలో వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లచట్టాల రద్దు కోసం ఏడాది కాలంగా వీరోచితంగా పోరాడి అమరులైన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేసియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యల నివారణ, పంటలకు ధరల కోసం అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ స్వామినాధన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ఏడాది కాలంగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రైతులు అనేక ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. 700 మంది రైతుల బలిదానాల తర్వాత కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించినట్టు చెప్పారు. అదేవిధంగా కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లుతో పాటు కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు తీసుకొస్తే.. ఉచిత విద్యుత్‌ను తొలగించి మోటార్లకు మీటర్లను బిగించే దుస్థితి వస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా బీఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వే, విమానయానం, సముద్రయానం వంటి పబ్లిక్ సెక్టార్లను ప్రయివేటుపరం చేస్తోందన్నారు. కేంద్రం ఇప్పటికైనా పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి ఎ.రాములు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి, సీనియర్ నాయకులు కురుమూర్తి, సీపీఐ జిల్లా కార్యదర్శి పరమేశ్వర్‌గౌడ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాంమ్మోహన్, సీఐటీయూ పట్టణ కార్యదర్శి బొల్లె చంద్రకాంత్, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.