Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చలతో సమస్యలు పరిష్కారం: రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య
నవతెలంగాణ-నిర్మల్
ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలిగినప్పుడే నిజమైన మానవ హక్కులు అమలవుతాయని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ అధ్యక్షతన జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. మానవ జీవితమే.. మానవ హక్కు అన్నారు. ఒకరి హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవంగా జీవించడం ప్రాథమిక హక్కులని తెలిపారు. మానవహక్కులు సరిగ్గా అమలు కావడం లేదని భావించి, 1983లో కేంద్రం మానవహక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించి.. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లో మానవహక్కుల కమిషన్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. చర్చలు, వార్తా పత్రికల ద్వారా ప్రజలకు మానవ హక్కులపై అవగాహన కల్పించాలన్నారు. ఒక వ్యక్తి ఏదైనా సమస్యతో అధికారి వద్దకు వస్తే.. తన పరిధిలో లేనప్పుడు రాతపూర్వకంగా పై అధికారికి పంపుతూ సంబంధిత వ్యక్తికి కూడా తెలియజేయాలన్నారు. అప్పుడే ఆ అధికారికి రిమార్క్ ఉండదని సూచించారు. తమ అధికారాన్ని సక్రమంగా అమలు చేయడం రాజ్యాంగపరమైన విధి అన్నారు. ప్రపంచంలో అనేక యుద్ధాలు కేవలం అధికారం కోసమే జరిగాయని స్పష్టం చేశారు. మానవాళి రక్షణకు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. గతంలో పాఠశాలల్లో విద్యార్థులకు మైదానం ఉండేదని, గ్రామ పంచాయతీల్లో పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆటలతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. ఆశ్రమ స్కూల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి చిన్న పండుగకూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లకుండా వారికి అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ మాట్లాడుతూ.. ప్రతి అంశంలో మానవ హక్కులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, పి.రాంబాబు, ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు.