Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ జిల్లా ప్రథమ మహాసభలో
- 18మంది సభ్యులతో జిల్లా కమిటీ ఎన్నిక
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా ఎం. చుక్కయ్య
నవతెలంగాణ-ఎన్జీవోస్కాలనీ
హన్మకొండ జిల్లా సమగ్రాభివృద్ధికి పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా ప్రథమ మహాసభలో దిశానిర్ధేశం చేసినట్టు సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య తెలిపారు. బుధవారం హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు తొమ్మిదిన్నరలక్షల జనాభా ఉందనీ, ఇందులో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, అణగారిన వర్గాలే అధికంగా ఉన్నారన్నారు. ఉద్యోగం, ఉపాధి లేక యువత నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటులో పాలకులు ప్రగల్భాలు పలికి విస్మరించారన్నారు. నేటికీ ఒక్క పెద్ద పరిశ్రమ తీసుకురాలేదనీ, ఉన్న పరిశ్రమల్ని మూసేశారని విమర్శించారు. గీసుకొండ మండలం శాంపేట గ్రామంలో శంకుస్థాపన చేసిన మెగా టెక్స్టైల్ పార్కు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. జిల్లాలో కొత్తగా మరిన్ని ఐటీ, ట్రాన్స్పోర్ట్, విమానాశ్రయ, తదితర రంగాలు, మధ్య తరహా కుటీర పరిశ్రమలు రావాలని కోరారు. అసంఘటిత కార్మికులు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లాకు గుండెకాయలాంటి రైల్వే పరిశ్రమను, అందులో పనిచేస్తున్న సుమారు ఐదువేలమంది కార్మికుల పరిరక్షణకు, రైల్వే డివిజన్ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. కార్మిక పోరాటాలకు సీపీఐ(ఎం) మద్దతు ఉంటుందని అన్నారు. నగరంలో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చే వరకు పోరాడతామని అన్నారు. మురుగువాడల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. అనంతరం జిల్లా సమగ్రాభివృద్ధికి పలు తీర్మానాలు చేసినట్టు తెలిపారు.
హన్మకొండ జిల్లా కమిటీ ఎన్నిక
సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా ప్రథమ మహాసభల్లో 18మంది సభ్యులతో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిగా ఎం. చుక్కయ్య, కార్యదర్శివర్గ సభ్యులుగా సారంపల్లి వాసుదేవరెడ్డి, జి. ప్రభాకర్‌రెడ్డి, టి.ఉప్పలయ్య, గొడుగు వెంకట్, జిల్లా కమిటీ సభ్యులుగా వాంకుడోత్ వీరన్న, గుమ్మడి రాజుల రాములు, డి. తిరుపతి, ఈ. అఖిల్రావు, కెవై నాయక్, బివి రెడ్డి, ఎల్. దీప, మంద సంపత్, కాడబోయిన లింగయ్య, డి. భానునాయక్, బొట్ల చక్రపాణి, భాషబోయిన సంతోష్ ఎన్నికయ్యారు.