Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీ, కలెక్టర్‌ను కలిసిన పంచాయతీరాజ్ చాంబర్ నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తది విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. నామినేషన్ వేయడానికి వెళ్లిన ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులపై టీఆర్ఎస్ నేతలు దాడిచేయడాన్నీ, నామినేషన్ పత్రాలను చింపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి కలెక్టరేట్లో నామినేషన్ల దాఖలు సమయంలో జరిగిన పరిణామాలపై పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వేర్వేరుగా వినతిపత్రాలను బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ఉపాధ్యక్షులు పసులూరి అశోక్ రావు, దేశమొల్ల అంజన్న, మందిపల్ వెంకట్, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింపుల శైలజ, తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు తమపై దౌర్జన్యం చేసి నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుని నామినేషన్ పత్రాలను చింపేశారని ఫిర్యాదు చేశారు.
నామినేషన్లు కూడా వేయనివ్వరా?...టీఆర్ఎస్ నేతల దాడిని ఖండిస్తున్నాం : సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీలను నామినేషన్లు వేయకుండా టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం దారుణమనీ, దాన్ని ఖండిస్తున్నామని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోటు రంగారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్.శైలజ నామినేషన్ వేయడానికి వెళ్లగా..మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, అతని అనుచరులు పత్రాలను చింపేయడం అన్యాయమని తెలిపారు. తమ ఎదుటే ఘటన జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఈ దౌర్జన్యం అప్రజాస్వామికమనీ, ఎన్నికల స్వేచ్ఛకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.