Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన అందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి
- పట్టణాల్లోనూ ఉపాధి హామీని వర్తింపచేయాలి
- వచ్చేనెల 10 వరకు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలిస్తాం
- ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ:
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అధిక ధరలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు ముఖ్యంగా మహిళలు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణజ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం స్వర్ణలతతో కలిసి మల్లు లక్ష్మి మాట్లాడారు. ఐద్వా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లాక్డౌన్ తర్వాత మహిళల ఆర్థిక స్థితిగతులపై 25 జిల్లాల్లో సర్వే చేపట్టామని అన్నారు. 250 మండలాలు, వివిధ పట్టణాల్లో జరిగిన ఈ సర్వేలో వెయ్యి మంది ఐద్వా కార్యకర్తలు, నాయకులు భాగస్వాములయ్యారని వివరించారు. మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. ఉపాధి సమస్య తీవ్రంగా ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో పట్టణాల్లో ఇండ్లలో పనిచేసే వారు, అడ్దామీద కూలీలు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌లో పనిచేసే వారు చాలా మంది ఉపాధి కోల్పోయారని అన్నారు. అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయి చెల్లించలేక, పిల్లల బడి ఫీజులు కట్టలేక, కరెంటు బిల్లులు, ఇతర అవసరాలు తీర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కుటుంబం గడవడం కోసం చాలా మంది అప్పులపాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులను తగ్గించాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని 200 రోజులకు, కూలి రూ.600కు పెంచాలనీ, పట్టణ ప్రాంతాలకూ వర్తింపచేయాలని సూచించారు. వీధి వ్యాపారులకు రూ.పది వేల కంటే ఎక్కువ రుణాలివ్వాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలన్నారు. వంటగ్యాస్ సబ్సిడీని కొనసాగించాలని అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ను పటిష్టం చేయాలనీ, కేరళ తరహాలో 17 రకాల నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వచ్చేనెల ఒకటి నుంచి పది వరకు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావును కలుస్తామని చెప్పారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.