Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం
నవతెలంగాణ-విలేకరులు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ బుధవారం పూర్తయింది. మొత్తం 82మంది అభ్యర్థుల నామి నేషన్లను ఆమోదించగా.. 23మందివి తిరస్కరించారు. అత్యధికంగా ఆదిలాబాద్ నుంచి 29మంది పోటీలో ఉన్నారు. నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం కానుంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉంది. నిజామాబాద్ స్థాని క సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత ఎన్నిక ఏకగ్రీ వం కానుంది. ఆమెతో పాటు నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి కోట గిరి శ్రీనివాస్ నామినేషన్ ఫారం-26 అఫిడవిట్లో తప్పులు ఉన్నందున తిరస్కరణకు గురైంది. ఎన్నికల పరిశీలకులు అనితా రాజేంద్ర, రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నామినేషన్లను పరిశీలించగా.. కల్వకుంట్ల కవిత నామినేషన్ పత్రాలు సరిగా ఉన్నట్టు ధృవీకరించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలకు టీఆర్ఎస్ నుంచి పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజులు, స్వతంత్ర అభ్యర్థిగా చలికా చంద్రశేఖర్ నామినేషన్లు వేయగా.. చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరించినట్టు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ తెలిపారు. చంద్రశేఖర్ నామినేషన్ పత్రంలో ప్రతిపాదకుల సంతకాలు లేకపోవడం, సెక్యూరిటీ డిపాజిట్ సమర్పించనందున తిరస్కరించినట్టు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థుల్లో.. స్వతంత్ర అభ్యర్థులు కొండపల్లి శ్రీనివాసరావు, కొండ్రు సుధారాణి, టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధుసూదన్, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు సమర్పించిన నామినేషన్స్ సరిగా ఉన్నాయని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 11 మంది నామినేషన్లు దాఖలు చేయగా మూడు నామినేషన్లు వివిధ కారణాల రీత్యా తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మొత్తం 8 మంది పోటీలో ఉన్నట్టు తెలిపారు. కరీంనగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సమర్పించిన నామినేషన్లలో ముగ్గురి నామినేషన్లు తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల స్క్రుట్నిలో శ్రీకాంత్ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్‌రెడ్డి నామినేషన్లు తిరస్కరించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 24 మంది ఉన్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. 4 ఆమోదం కాగా 6 నామినేషన్లు వివిధ కారణాల రీత్యా తిరస్కరించినట్టు జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కావలి శ్రీశైలం, సుధాకర్ రెడ్డి నామినేషన్లు ఆమోదించారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 9 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. టీఆర్ఎస్ అభ్యర్థితోపాటు నలుగురి నామినేషన్లు ఆమోదించారు. అలాగే బీరం దేవేందర్‌రెడ్డి నామినేషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు 30మంది నామినేషన్లు వేయగా.. అన్నీ సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ధృవీకరించారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోటపల్లి మండలం ఏదుల బంధం గ్రామానికి చెందిన జేక శేఖర్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. శాసన మండలి మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏడుగురు అభ్యర్థులు 13 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. ఐదుగురు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల అధికారి కలెక్టర్ హరీష్ తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఒంటేరి యాదవ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి టి.నిర్మల, స్వతంత్ర అభ్యర్థులు బోయిన విజయలక్ష్మి, సాయిబాబా చింతల, మట్ట మల్లారెడ్డిల నామినేషన్ పత్రాలను ఆమోదించారు.