Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచారానికి నిధుల్లేవంటున్న అధికారులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఈ-శ్రమ్ పోర్టల్ అమల్లో ఉందా.. ఉంటే, దానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి.. దీనివల్ల ఉపయోగాలేంటి.. అనేది ఇంతవరకు అసంఘటిత కార్మికులకు తెలియని పరిస్థితి. అసంఘటిరంగ కార్మికుల పోరాటం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ శ్రామ్ పోర్టల్‌పై కనీస అవగాహన కల్పించలేదు. పేర్లు ఎలా నమోదు చేసుకోవాలి, సంక్షేమ పథకాలతో పాటు వివిధ రకాల భద్రత స్కీంలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పటి వరకూ కార్మికులకు అవగాహన కల్పించింది లేదు. దీనిపై ప్రచారం కల్పించడానికి నిధుల్లేవంటూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరి వివరాలను ఈ శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే వారికి సామాజిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రతి కార్మికుడూ ఉచితంగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నమోదు ప్రక్రియను ఆగస్టు 26, 2021 నుంచి ప్రారంభించారు. దీని కోసం 10 రోజుల కిందట నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కార్మికశాఖ, కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించారు. విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అయినా, ఎక్కడా వారు కదలడం లేదు. నిధుల్లేకుండా కార్యక్రమాలు, ప్రచారం ఎలా నిర్వహించాలని ప్రశ్నిస్తున్నారు.
అసంఘటిత రంగ కార్మికులంటే..
వ్యవసాయం, అనుబంధ ఉపాధి రంగాల్లో పనిచేసేవారు, చిన్న, సన్నకారు, వ్యవసాయ కూలీలు, వివిధ రంగాల కార్మికులు అసంఘటిత రంగం పరిధిలోకి వస్తారు. ఉద్యానవన, నర్సరీలు, పారిశ్రామిక, మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు, ప్లంబింగ్, శానిటరీ, పెయింటర్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టి కార్మికులు, కాంక్రీట్ మిల్లర్లు, హమాలీ, దుకాణాల్లో పని చేసే వారు, బీడీ కార్మికులు, బావులు తవ్వడం, చేతివృత్తుల వారు, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకారులు, వీధి వ్యాపారులు, చిరువ్యాపారులు, కల్లుగీత కార్మికులు, రిక్షా కార్మికులు, కళాకారులు, ఇండ్లల్లో పాచిపని చేసేవారు, ఉపాధి హామీ కార్మికులు, ఆశావర్కర్లు, మహిళా సంఘాలు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యావాలంటీర్లు, గ్రామ, వార్డు వాలంటీర్లు తదితర రంగాల్లో చేసేవారంతా అసంఘటిత రంగ కార్మికులు.
అవగాహన కరువు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసంఘటిరంగ కార్మికులు పెద్దఎత్తున ఉన్నారు. భవన నిర్మాణ రంగంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు 1.20 లక్షల మంది ఉన్నారు. మిగతా రంగాలను కలుపుకుంటే దాదాపు 4 నుంచి 4.50 లక్షల మంది కార్మికులు ఉంటారని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇంతమందికి ఉపయోగపడే ఈ పథకంపై వారికి కనీస అవగాహన లేదు. కార్మికులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ ఆదేశాల్చినప్పటికీ ఏ ఒక్కరూ ఏ ప్రాంతంలో కార్మికులతో సమావేశం నిర్వహించిన సందర్భం లేదు. కార్మిక సంఘాల ప్రతినిధులు ఎవరైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావించినా.. అధికారులు సహకరించడం లేదని తెలుస్తోంది. ఇంతవరకు ఈ పథకంపై ఒక్క పోస్టర్, కరపత్రం పంపిణీ చేయలేదు. ప్రచారం కోసం తమకు బడ్జెట్ లేదని, ఎలా చేయాలని అధికారులు అంటున్నట్టు సమాచారం.
అధికారులు చొరవ తీసుకోవాలి
చిన్నపాక లక్ష్మినారాయణ- సీఐటీయూ నల్లగొండ జిల్లా అధ్యక్షులు
లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఉపయోగపడే ఈ-శ్రామ్ పోర్టల్‌పై అధికారుల చొరవ లేకపోవడం వల్ల నీరుగారే ప్రమాదం ఉంది. వెంటనే గ్రామ స్థాయిలో ఉన్న వివిధ ఆన్లైన్ సెంటర్ల ద్వారా కార్మికుల నమోదు ప్రక్రియ చేపట్టాలి. మండల స్థాయిలో కార్మిక సంఘాలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యం చేస్తే ఫలితాలు వస్తాయి.