Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల బందోబస్తు.. అడ్డుకున్న గిరిజనులు
నవతెలంగాణ- పాన్గల్
గిరిజనుల భూమిలో సర్వే చేయొద్దంటూ హైకోర్టు స్టే ఇచ్చినా అధికారులు అదేమీ పట్టించుకోకుండా గుట్టుచప్పుడు కాకుండా సర్వేకొచ్చారు. బుధవారం పోలీసు బందోబస్తుతో వచ్చి భూముల ను సర్వే చేస్తుండగా.. గిరిజనులు వెళ్లి అడ్డుకున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వనపర్తి జిల్లా పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన 70 మంది తరతరాల నుంచి శివారులో ఉన్న 135, 196, 385, 396, 380 తదితర సర్వేనెంబర్లలోని భూమిలో సాగు చేస్తున్నారు. అందులో 70 ఎకరాలు గిరిజనులకు చెందేలా 1970లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వం గిరిజనులకు పట్టాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రామకృష్ణ దశరథుడు, పట్టాభి రామారావు కరణర పట్టాదారులుగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే, అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో ఆ భూస్వాములు గిరిజనులు సాగులో ఉన్న భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో గిరిజనులు కోర్టుకెళ్తే.. వారి భూముల జోలికెళ్లొద్దని హైకోర్టు నవంబర్ 23న స్టే ఇచ్చింది. ఆ కాపీతోపాటు వినతిపత్రాన్ని కలెక్టర్, జిల్లా సర్వే అధికారికి గిరిజన రైతులు అందజేశారు. అయినా, కోర్టు స్టేను ధిక్కరించి వందలాది మంది పోలీసులతో వచ్చి అధికారులు భూముల్లో సర్వే చేశారు. విషయం తెలుసుకున్న గిరి పుత్రులు వెళ్లి అడ్డుకున్నారు. కానీ, పోలీసు బలగాల సహాయంతో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఏం బాల్యానాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల భూముల్లో సర్వే చేయొద్దని హైకోర్టు స్టే ఇవ్వడంతో రైతులు పంటలు వేసుకున్నారన్నారు. అయినా అధికారులు పోలీసులను వెంట తెచ్చుకుని సర్వే చేశారన్నారన్నారు. కోర్టు స్టేను ధిక్కరించిన రెవెన్యూ అధికారులపై, పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్కు, మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకుడు బాబు నాయక్, రాజు నాయక్ , భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.