Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీ పర్యటనపై రేవంత్
- రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. తీర్థయాత్రలతో అయ్యేది లేదు... పొయ్యేదీ లేదని పేర్కొన్నారు. ఆ పార్టీలు హస్తినలో ఆడుతున్న డ్రామాలను బహిర్గతం చేస్తూ బుధవారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కల్లాల్లో ధాన్యం కొనకుండా యాసంగి పంటపై ఢిల్లీలో డ్రామాలేంటని ప్రశ్నించారు. తడిచిన ధాన్యం కొనే విషయంలో కేసీఆర్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. సర్కారు ఆలస్యం చేయడంతోనే ధాన్యం తడిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ఉద్యమ ఒత్తిడితోనే సాగు చట్టాల విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. యాసంగి ధాన్యం కొనాలంటూ కేంద్రాన్ని ఒత్తిడి చేయబోమని సీఎం కేసీఆర్ లేఖ ఇవ్వడంతో అది రైతులపాలిట ఉరితాడైందని పేర్కొన్నారు.ఆ పార్టీలు రైతుల విశ్వాసాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు. కల్లాల్లో రైతులు కంటనీరు పెడుతుంటే, ఢిల్లీలో కేసీఆర్ సేద తీరుతున్నారని విమర్శించారు. రైతులతో పాలకులు పెట్టుకుంటే పాతరేస్తారన్న భయం వచ్చిందనీ, అందుకే మోడీ క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. ఆ చట్టాలను సమర్ధించిన కేసీఆర్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. రైతులను కష్టాల నుంచి గట్టెక్కించాలంటే, కేంద్ర ప్రభుత్వం వెంటనే కనీస మద్ధతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు హామీ ఇచ్చిన లక్ష రుణమాఫీ చేయాలనీ, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు. తక్షణమే వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కౌలు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారనీ, అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.