Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్
- నాలుగు రోజులపాటు హస్తినలో గడిపిన సీఎం
- దొరకని ప్రధాని అపాయింట్మెంట్
- ధాన్యం కొనుగోళ్లపై హామీ ఇవ్వని కేంద్రం
ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ పెద్దలతో తాడో పేడో తేల్చుకుంటానంటూ హస్తిన బయల్దేరి వెళ్లిన సీఎం కేసీఆర్...ఎలాంటి యుద్ధం చేయకుండానే అక్కడి నుంచి తిరిగొచ్చారు. స్పష్టమైన హామీతో ఆయన వస్తారని అందరూ భావిస్తే... అందుకు విరుద్ధంగా ఉత్త చేతుల్తోనే హైదరాబాద్‌లో దిగారు. ఆదివారం దేశ రాజధానికి బయల్దేరి వెళ్లిన ఆయన... నాలుగు రోజులపాటు అక్కడే మకాం వేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్కపోవడంతోనే ఆయన రిక్త హస్తాలతో తిరిగొచ్చినట్టు తెలిసింది.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వానాకాలం ధాన్యాన్ని మొత్తం కొంటరా..;? కొనరా..? యాసంగిలో ఎలాంటి పంటలు వేసుకోవాలనే అంశాలపై కేంద్రంతో తేల్చుకుంటానంటూ సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆదివారం సాయంత్రం అక్కడికి చేరుకున్న కేసీఆర్... బుధవారం మధ్యాహ్నం వరకు అక్కడే (తన నివాసమైన 23- తుగ్లక్ రోడ్లో) ఉన్నారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ధాన్యం కొనుగోళ్లపై అవసరమైతే ప్రధానిని కలుస్తానన్న ఆయన చివరి వరకూ ఎవరినీ కలవలేకపోవటం గమనార్హం. మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం మంగళవారం... కేంద్రమంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర తోమర్‌తో సమావేశమై చర్చించింది. ఆ భేటీకి సీఎం హాజరుకాలేదు. అయితే ఆయన ప్రధానిని కలుద్దా మని భావించారనీ, కానీ అపాయింట్మెంట్ దొరకలేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో బుధవారం సాయంత్రం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మోడీని కలిశారు. ఆమెకు పీఎంవో నుంచి అపాయింట్మెంట్ ఓకే కావటం గమనార్హం. ఈ క్రమంలో నాలుగు రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్‌కు ప్రధాని మోడీ నిజంగానే అపాయింట్మెంట్ ఇవ్వలేదా..? లేదంటే ఈయన తీసుకోలేదా..? అనే చర్చ ఇప్పుడు కొనసాగుతున్నది.. మరోవైపు సీఎం సతీమణి శోభ ఆరోగ్య పరీక్షల నిమిత్తమే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారనే వాదన కూడా బలంగా వినబడుతున్నది.
ఆమె గతం నుంచే అక్కడి ఎయిమ్స్‌లో చికిత్స, వైద్యుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వైద్య అవసరాలతోపాటు 'కుటుంబ అవసరాల కోసమే...' ఆయ న ఢిల్లీ వెళ్లొచ్చారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతు న్నాయి. ఇందుకోసమే సీఎం ఢిల్లీ విమానమెక్కారు తప్ప 'ధాన్యం' కోసం కాదనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా స్పంది స్తారా? లేదా..? అనేది వేచి చూడాలి. ఏదేమైనా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సీఎం ఢిల్లీ వెళ్లి... ఏదో సాధించు కొస్తారని భావించిన రైతులకు మాత్రం నిరాశే మిగిలింది.