Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్
- 27, 28 తేదీల్లో 'వరి దీక్ష'
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైౖతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ దొంగ నాటకాలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి విమర్శించారు. ఈనెల 27,28 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద 'వరి దీక్ష' చేయనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ (ఎన్ఆర్ఐ) అమెరికా విభాగం అధ్యక్షులు అభిలాష్రావు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరారు. వారికి రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అత్యంత వెనకబడిన పాలమూరు జిల్లా పాలకుల నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాలకు సాగు నీరు ఇవ్వలేదనీ, భూనిర్వాసితులకు పరిహారం కల్పించడంలోనూ టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు.'తెలంగాణ ఎవరి కోసమోచ్చింది. ఎవరు పాలన చేస్తున్నారు. ప్రజలు ఆలోచన చేయాలి' అని విజ్ఞప్తి చేశారు. పాలమూరులో ఓటు అడిగే నైతిక హక్కు మీకు ఉందా? అని టీఆర్ఎస్ ప్రశ్నించారు. తనకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడమంటే, అది మన జిల్లాకు ఇచ్చిన గౌరవంగా భావిస్తానన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ జెండా ఎగురువేయాలని కోరారు. ఆ విజయాన్ని సోనియాగాంధీకి కానుకగా ఇద్దామని చెప్పారు. అభిలాష్రావు మాట్లాడుతూ పదేండ్లపాటు టీఆర్ఎస్లో పని చేశానన్నారు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తాను కాంగ్రెస్లో చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్ సిద్దాంతమే నా సిద్ధాంతంగా భావించి పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో పాలమూరు జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.